కామెడీ వరకు చూస్తే తెలుగు సినీ చరిత్రలో మరే నటుడూ అందుకోలేని స్థాయిని చేరుకున్నారు బ్రహ్మానందం. దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో ఓ మూడు దశాబ్దాలు బ్రహ్మానందంది తిరుగులేని ఆధిపత్యం. గత దశాబ్ద కాలంలోనే బ్రహ్మానందం జోరు తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఆయన దాదాపుగా సినిమాల నుంచి అంతర్ధానం అయిపోయారు.
ఈ మధ్య అల వైకుంఠపురములో సినిమాలో రాములో రాములా పాటలో కొన్ని క్షణాల పాటు తళుక్కుమని అభిమానుల్ని మురిపించారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో మీమ్స్ చేసేవాళ్లందరూ బ్రహ్మానందం హావభావాలతో కూడిన ఫొటోలనే ఉపయోగిస్తున్నారు. సామాన్య జనం కూడా సందర్భానికి తగ్గట్లుగా తమ ఉద్దేశాల్ని బ్రహ్మి ఫొటోల ద్వారానే చెబుతుంటారు. కామెడీ విషయంలో బ్రహ్మి వేసిన ముద్ర అలాంటిది.
ఐతే రచయితలు, దర్శకుల వైఫల్యం వల్ల బ్రహ్మికి సరైన పాత్రలు పడక ఆయన తెరమరుగైపోయారు. ఐతే కొంత విరామం తర్వాత బ్రహ్మి ఓ షాకింగ్ పాత్రతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నట్లు సమాచారం. విలక్షణ దర్శకుడు కృష్ణవంశీ రూపొందిస్తున్న రంగమార్తాండలో బ్రహ్మి ఓ పాత్ర చేస్తున్నారు. ఐతే అందులో ఆయన ఎప్పట్లా కామెడీ చేయబోవట్లేదట. బ్రహ్మి పాత్ర పూర్తి సీరియస్‌గా సాగుతుందట.
ఆయన తన నటనతో కన్నీళ్లు పెట్టించబోతున్నాడట. ఈ సినిమాలో బ్రహ్మి పాత్ర చివర్లో చనిపోతుందని.. అప్పుడు ప్రేక్షకుల హృదయాలు బరువెక్కుతాయని అంటున్నారు. ఇంతకుముందు బాబాయి హోటల్, అన్న లాంటి సినిమాల్లో బ్రహ్మి ప్రేక్షకుల్ని ఏడిపించాడు. ఐతే గత రెండు దశాబ్దాల్లో ఆయన్నుంచి కామెడీ పాత్రలే వచ్చాయి. ఇప్పుడు కమెడియన్‌గా బ్రహ్మి కెరీర్ క్లోజ్ అయిపోయిన నేపథ్యంలో సీరియస్ పాత్రలో అయినా మెప్పించి ఒప్పిస్తారేమో చూడాలి.