టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై కనువిందు చేయనున్నారు. బిగ్‌బాస్ సీజన్ 1 రియాల్టీ షో వ్యాఖ్యాతగా బుల్లితెరపై తనదైన చెరగని ముద్ర వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్…మరోసారి లాక్డౌన్ సమయంలో ఇంటిల్లిపాదిని పలకరించడానికి వస్తున్నారు. ఆ శుభ దినం ఆదివారం అంటే నేటి నుంచే కావడం విశేషం.
2017లో మొట్ట మొదటిసారిగా స్టార్‌మాలో బిగ్‌బాస్ సీజన్ 1 రియాల్టీ షో ప్రారంభమైంది. అంత వరకు వెండితెరపై అగ్రహీరోగా పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్…బిగ్‌బాస్ వ్యాఖ్యాతగా బుల్లితెరపై కనిపించారు. ఈ షో వ్యాఖ్యాతగా తనదైన శైలిలో సహజమైన ధోరణితో ఆకట్టుకున్నాడు. ఆ షోకు జూనియర్ ఎన్టీఆర్ అదనపు బలంగా నిలిచాడు.
ఆ తర్వాత బిగ్‌బాస్ రియాల్టీ షోలు 2, 3 కూడా సాగాయి. రెండో సీజన్‌కు సహజ నటుడు నాని, మూడో సీజన్‌కు మన్మథుడు నాగార్జున వ్యాఖ్యాతలుగా రాణించారు. కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుండటం, దాన్ని కట్టడి చేయడానికి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీరియల్స్ షూటింగ్స్ నిలిచిపోవడంతో పలు చానళ్లు పాత సీరియళ్లు, సినిమాలు ప్రసారం చేస్తున్నాయి.
ఇందులో భాగంగా స్టార్ మా చానల్లో బిగ్‌బాస్ సీజన్ -2 రియాల్టీ షో పునఃప్రసారమవుతోంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్ సీజన్-1 రియాల్టీ షోను ఆదివారం నుంచి పునః ప్రసారం చేయనున్నారు. ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ట్విటర్లో తెలిపి ఆనందం పంచుకుంటున్నారు.