ఏదైనా విపత్తు సంభవించినప్పుడే నిజమైన మనిషి అన్నవాడు బయటికొస్తాడు. మనిషి అంటే మంచి మనసు అని అర్థం. కష్టాల్లో ఉన్న వాళ్లకు సాటి మనిషిగా సాయం అందించడమే మనిషి జీవితానికి అర్థం, పరమార్థం. కరోనా మహమ్మారి నెలరోజులుగా భారతావనిని అతలాకుతలం చేస్తోంది. ఆర్థికంగా మన వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తోంది. తినడానికి తిండి కరువవుతున్న పరిస్థితులు రోజురోజుకూ దాపురిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తోటి వారికి సాయం అందించేందుకు తమిళ హీరో పెద్ద మనసుతో ముందుకొచ్చాడు. తన పేరుకు తగ్గట్టే తనది విశాలమైన హృదయమని నిరూపించుకున్నాడు. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి లాక్‌డౌన్ విధించడంతో ఎక్కడి పనులు అక్కడ ఆగాయి. దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) సభ్యులు ఆర్థిక ఇబ్బందులతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. సభ్యులను ఆదుకునేందుకు నటుడు విశాల్ ముందుకొచ్చాడు.
150 మంది సభ్యులకు నెలకు సరిపడే నిత్యావసర వస్తువులను ఆయన అందించాడు. విశాల్‌కు తోటి నటులు శ్రీమాన్, దళపతి దినేష్ అండగా నిలిచారు. ఇతర ఊర్లలో ఉన్న సభ్యులకు కూడా సాయం అందే ఏర్పాట్లు చేస్తున్నారు. 300 మంది హిజ్రాలకు నిత్యావసర వస్తువులను అందించారు. అదేవిధంగా కరోనా నివారణకు సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులకు 1,000 మాస్క్‌లు, 1,000 శానిటైజర్లు అందించారు.
విశాల్ నుంచి సాయం పొందిన వాళ్లు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మంచి మనసుతో ఇబ్బందుల్లో ఉన్న వాళ్లను ఆదుకునేందుకు ముందుకొచ్చిన విశాల్‌ను తమిళ చిత్ర పరిశ్రమ అభినందిస్తోంది.