కరోనా వైరస్ మహమ్మారి కారణంగా థియేటర్లు మూత పడి, షూటింగ్స్ కి బ్రేక్ పడి సినీ పరిశ్రమ దారుణమైన స్థితిని ఎదుర్కొంటోంది. లాక్ డౌన్ మే నెలలో ఎత్తేసినా… సమూహాలని ఇప్పట్లో అనుమతించరు కనుక సినిమా థియేటర్లు జూన్ లేదా జులైకి ఓపెన్ అవుతాయని ఆశాభావంతో ఉన్నారు. రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాల నిర్మాతలైతే మళ్ళీ యథాతథ స్థితి వచ్చేస్తే బాగుండని కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు.
అయితే సీనియర్ నిర్మాత, తెలుగు రాష్ట్రాలలో నాలుగొందల థియేటర్లు ఉన్న సురేష్ బాబు ఈ ఏడాది చివరి వరకు థియేటర్లు తెరుచుకోక పోవచ్చునని భావిస్తున్నారు. సురేష్ బాబు లాంటి ఆచి తూచి మాట్లాడే వ్యక్తి తెలుగు సినిమాని నమ్ముకుని ఉన్నవారికి పిడుగుపాటు లాంటి ఇలాంటి మాటలు ఊరికే మాట్లాడరు. ఆయన మాటల్ని తేలిగ్గా తీసుకోవడానికి లేదు.
లాజికల్ గా ఆలోచిస్తే ఆయన చెబుతున్నది కూడా సాధ్యమే. ఇండియాలో మళ్ళీ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ ని ఎంకరేజ్ చేయాలంటే కరోనా భయం పూర్తిగా పోవాలి. అది జరగడానికి వాక్సిన్ రావడం ఒక్కటే మార్గం అంటున్నారు కనుక అందాకా అన్నీ తెరుచుకున్న చిత్ర పరిశ్రమకి గొళ్ళెం తప్పక పోవచ్చు.