వ‌న్ అండ్ ఓన్లీ.. శ్రీమంతుడు

తొలిసారి నాన్-బాహుబ‌లి ఇండ‌స్ట్రీ రికార్డును సాధించిన సినిమా శ్రీమంతుడు. బాహుబ‌లి: ది బిగినింగ్ రిలీజైన కొన్ని నెల‌ల‌కే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం అప్ప‌ట్లోనే రూ.90 కోట్లకు పైగా షేర్ రాబ‌ట్టి నాన్-బాహుబ‌లి రికార్డు నెల‌కొల్పింది. మ‌హేష్ బాబు కెరీర్లోనే అత్యుత్త‌మ చిత్రాల్లో ఒక‌టైన శ్రీమంతుడు.. ఇప్ప‌టికే టీవీల్లో ప్రిమియ‌ర్ల‌లో చాలా మంచి స్పంద‌న తెచ్చుకుంది.

ఆ సినిమా ఎప్పుడు టీవీలో వేసినా వ్యూయ‌ర్ షిప్ భారీగా ఉంటుంది. మ‌హేష్ కెరీర్లో అత్య‌ధిక టీఆర్పీ తెచ్చుకున్న సినిమాల్లో కూడా ఇదొక‌టి. ఇప్పుడు ఆ చిత్రం యూట్యూబ్‌లో అరుదైన రికార్డు సాధించింది. 100 మిలియ‌న్ (ప‌ది కోట్లు) వ్యూస్ సాధించిన తొలి తెలుగు సినిమాగా రికార్డు నెల‌కొల్పింది.

తెలుగు సినిమాలు హిందీలోకి డ‌బ్ అయి ఇంత‌కంటే ఎక్కువ వ్యూసే రాబట్టుకున్నాయి. స‌రైనోడు హిందీ వెర్ష‌న్ ఏకంగా 27.2 కోట్ల వ్యూస్‌తో సాగుతోంది. దువ్వాడ జ‌గ‌న్నాథం సైతం దీనికి దీటుగా 23 కోట్ల‌ వ్యూస్ రాబ‌ట్టుకుంది. అయితే హిందీ జ‌నాలు తెలుగు నుంచి అనువాద‌మై వ‌చ్చిన ప్ర‌తి మాస్ సినిమానూ ఇర‌గ‌బ‌డి చూసేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలకు కూడా కోట్ల‌ల్లో వ్యూస్ వ‌స్తున్నాయి.

అయితే తెలుగులో ఏ సినిమా కూడా ఇప్ప‌టిదాకా యూట్యూబ్‌లో 100 మిలియ‌న్ వ్యూస్ తెచ్చుకోలేదు. శ్రీమంతుడు రికార్డును మ‌రే తెలుగు సినిమా అయినా బ‌ద్ద‌లు కొడుతుందా అన్న‌ది కూడా డౌటే. ఎందుకంటే కొన్నేళ్లుగా యూట్యూబ్‌లో పేరున్న ఏ కొత్త సినిమా రిలీజ్ కావ‌ట్లేదు. ఓటీటీల‌కు వెళ్లిపోతున్నాయి. కాబ‌ట్టి శ్రీమంతుడు యూట్యూబ్‌లో హైయెస్ట్ వ్యూస్ తెచ్చుకున్న తెలుగు సినిమా రికార్డును కొన‌సాగించే అవ‌కాశ‌ముంది.