దర్శక ధీరుడు రాజమౌళితో తమ హీరో ఓ సినిమా చేయాలని ప్రతి స్టార్ హీరో అభిమానులూ ఆశిస్తారు. అలా ఎక్కువగా కోరుకున్న వాటిలో ఒక కాంబినేషన్ త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. మహేష్ బాబుతో తన తర్వాతి సినిమా ఉంటుందని రాజమౌళి ఇటీవలే స్పష్టత ఇచ్చాడు.
ఇలాగే పవన్ కళ్యాణ్‌తోనూ జక్కన్న ఓ సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. కానీ ఈ కాంబినేషన్ గురించి ఎప్పుడూ వార్తలు రాలేదు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఖాళీగా ఉంటూ వరుసగా మీడియాతో మాట్లాడుతున్న రాజమౌళికి.. పవన్‌తో సినిమా గురించి ఓ ప్రశ్న ఎదురైంది.
దీనికి బదులిస్తూ పవన్‌తో సినిమా చేయడానికి గతంలో ప్రయత్నాలు జరిగినట్లు వెల్లడించాడు. తాను పవన్‌ను కలిసి కథ చెప్పే ప్రయత్నం కూడా చేశానని.. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదని చెప్పాడు జక్కన్న.
ఇప్పుడు రెండేళ్ల బ్రేక్ తర్వాత పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడేమైనా ఆయనతో సినిమా తీసే ప్రయత్నం చేస్తారా అని అడిగితే.. తమ కాంబినేషన్ కుదిరే అవకాశాలు తక్కువే అన్నాడు జక్కన్న.
పవన్ ఎక్కువగా రాజకీయాలు, ప్రజా సేవకే సమయం కేటాయిస్తున్నాడని.. సినిమాలకు చాలా తక్కువ సమయమే వెచ్చిస్తున్నాడని.. పైగా సామాజిక అంశాలతో కూడిన సినిమాలు చేయాలనే ఉద్దేశంతో కనిపిస్తున్నాడని.. తాను చూస్తే ఒక్కో సినిమాకు వెచ్చించే సమయం చాలా పెరిగిపోతోందని.. ఇలాంటి తరుణంలో తామిద్దరం కలిసి సినిమా చేసే అవకాశాలు చాలా తక్కువ అని.. ఏదైనా తక్కువ నిడివితో అయిపోయే పవర్ ఫుల్ క్యారెక్టర్‌తో ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే చెప్పలేమని అన్నాడు జక్కన్న.
ఇక సామాజిక స్పృహ, సమాజం పట్ల బాధ్యత విషయంలో మీకు, పవన్ కళ్యాణ్‌కు పోలికలున్నాయని యాంకర్ ప్రస్తావిస్తే.. ఈ విషయంలో తమ ఇద్దరికీ పోలికే లేదన్నాడు జక్కన్న. సమాజం, సేవ లాంటి విషయాల్లో రేటింగ్ ఇస్తే పవన్‌కు 100 మార్కులు పడితే.. తనకు 0.5 మార్కులు మాత్రమే వస్తాయని.. తమ ఇద్దరికీ ఈ విషయంలో పోలికే పెట్టొద్దని రాజమౌళి స్పష్టం చేశాడు.