బాలీవుడ్ ప్రముఖ నటుడు, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న భారతీయ నటుడు ఇర్ఫాన్ ఖాన్(54) ముంబైలో తుదిశ్వాస విడిచినట్టుగా కథనాలు వస్తున్నాయి. బాలీవుడ్ మీడియా ఇర్ఫాన్ ఖాన్ మరణించారంటూ బుధవారం ఉదయమే కథనాలను ఇచ్చింది. అయితే అవి అబద్ధాలని తర్వాత ఖండనల ప్రకటనలు విడుదల అయ్యాయి. ఇర్ఫాన్ స్పోక్ పర్సన్ ఆ ఖండన ప్రకటన విడుదల చేసినట్టుగా కథనాలు కనిపించాయి. అయితే ఇప్పుడు బీబీసీ తదితర మీడియా వర్గాలు కూడా ఇర్ఫాన్ ఖాన్ మరణించినట్టుగా కథనాలను ఇస్తున్నాయి.
కొంత కాలం కిందట తన అనారోగ్యం విషయాన్ని ప్రకటించారు ఖాన్. తను తీవ్ర అస్వస్థతకు గురి అయినట్టుగా ఆయన చెప్పారు. లండన్ లో చికిత్స తీసుకుంటూ వచ్చారాయన. అయితే ఆయన ఇటీవల మళ్లీ ఆసుపత్రి పాలయ్యారు. లాక్ డౌన్ వేళ ఆయన తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరినట్టుగా వార్తలు వచ్చాయి. ఇంతలోనే ఆయన మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి.
1988 లో సలాం బాంబేలో నటించడం ద్వారా ఇర్ఫాన్ ఖాన్ నటనా కెరీర్ మొదలైంది. అయితే ఆ తర్వాత సరైన బ్రేక్ కోసం చాలా కాలం ఎదురుచూడాల్సి వచ్చింది. 2001 నుంచి ఆయన కెరీర్ ఊపందుకుంది. బాలీవుడ్ తో పాటు పలు హాలీవుడ్ సినిమాల్లోనూ ఖాన్ నటించారు. వాటిల్లో నేమ్ సేక్, స్లమ్ డాగ్ మిలియనీర్, లైఫ్ ఆఫ్ పై.. తదితర సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. వైవిధ్యభరితమైన నటుడిగా నిలిచారు ఇర్ఫాన్ ఖాన్.
మధ్యలో ఒక తెలుగు సినిమాలో కూడా ఆయన నటించారు. మహేశ్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో విలన్ పాత్రలో కనిపించారు. అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఆ తర్వాత తెలుగులో ఇర్ఫాన్ కు మరే అవకాశాలూ రాలేదు. అయితే బాలీవుడ్ సినిమాలతో మాత్రం ఇర్ఫాన్ కు ఎంతో ఖ్యాతి లభించింది. ఇటీవలే ఆయన తల్లి మరణించారు. లాక్ డౌన్ వల్ల ఆమె అంత్యక్రియలకు కూడా ఆయన హాజరు కాలేకపోయారు. ఆ వెంటనే ఆసుపత్రి పాలై, ఆయనా మరణించడం విషాదకరం.