కిల్‌ ఫేక్‌ న్యూస్‌: మెగాస్టార్‌ చిరంజీవి ఆవేదన ఇదీ.!

మెగాస్టార్‌ చిరంజీవి.. సినీ పరిశ్రమలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకున్నారు.. రాజకీయ రంగంలోనూ ఆయన ఎదుర్కొనన్ని ఆటుపోట్లు బహుశా ఇంకెవరూ ఎదుర్కొని వుండరేమో. ‘జెండా పీకేద్దాం..’ అంటూ ఓ దిక్కుమాలిన వార్త రాస్తే, దానికి ఆయన తీవ్ర ఆవేదన చెందారు. వ్యక్తిగత జీవితాన్ని బజారుకీడ్చేందుకు, రాజకీయం – మీడియా ఒక్కటైనా తట్టుకున్నారు.

రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణం. సినిమా కూడా అంతే. కానీ, చిరంజీవిపై వ్యక్తిగత విమర్శలు, దూషణలు చోటు చేసుకున్నాయి. వెబ్‌ మీడియా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఆనాటి ఆ విషయాల్ని చిరంజీవి తాజాగా పరోక్షంగా ప్రస్తావించారు.

‘డియర్‌ విజయ్‌ దేవరకొండ.. మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. బాద్యత లేని రాతల వల్ల, మీలా నేను నా కుటుంబం బాధపడిన సందర్భాలున్నాయి. మేమంతా మీ వెంట వున్నాం. మంచి పని చేయాలనుకుంటున్న మీ ఆలోచనను ముందుకు సాగనివ్వండి. జర్నలిస్టులకు నా మనవి.. మీ వ్యక్తిగత ఆలోచనల్ని వార్తలుగా ప్రచారంలోకి తీసుకురావొద్దు..’ అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు.

‘‘వెబ్‌సైట్లకు విషయానికొస్తే.. మెగా ఫ్యామిలీని టార్గెట్‌ చేస్తూనే ఎక్కువ రాతలు వస్తుంటాయి. మరీ ముఖ్యంగా, ఇప్పుడు వివాదాలు ఎదుర్కొంటున్న ‘ముసలోడు’, ఆ ముసలోడు పనిచేస్తున్న వెబ్‌సైట్‌. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, నాగబాబు మాత్రమే కాదు.. సినిమాలతో సంబంధం లేని మెగా కుటుంబ సభ్యులపైనా జుగుప్సాకరమైన వార్తలు రాశారు..’’ అంటూ మెగా అభిమానులు సోషల్‌ మీడియాలో ‘ఆ వేధింపులకు’ సంబంధించిన ఆధారాల్ని పోస్ట్‌ చేస్తుండడం గమనార్హం.