సొంతూరిలో వ్య‌వ‌సాయం చేస్తున్న హీరోయిన్‌

లాక్‌డౌన్ వేళ సినీ సెల‌బ్రిటీలు త‌మ‌కిష్ట‌మైన రీతిలో గడుపుతున్నారు. ఏ మాత్రం ఖాళీగా లేరు. కొంద‌రు వంటింటిలో గ‌రిట తిప్పితే, మ‌రికొంద‌రు పుస్త‌కాలు చ‌దువుతూ, యోగా చేస్తూ కాలం వెళ్ల‌దీస్తున్నారు. మ‌రికొంద‌రు కొత్త ప‌నులు చేస్తూ అందులోని క‌ష్ట‌న‌ష్టాల‌ను రుచి చూస్తున్నారు.

ప్ర‌ముఖ హీరోయిన్ కీర్తీ పాండియ‌న్ మాత్రం రైతు అవ‌తారం ఎత్తారు. ప్ర‌ముఖ న‌టుడు అరుణ్ పాండియ‌న్ వార‌సురాలైన ఈమె తుంబ అనే చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యారు. ప్ర‌స్తుతం విల‌న్ అనే మ‌ల‌యాళ చిత్రం త‌మిళ రీమేక్‌లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు.

లాక్‌డౌన్‌తో షూటింగులు ఆగిపోవ‌డంతో కీర్తీ సొంతూరులో కుటుంబ స‌భ్యుల‌తో గ‌డుపుతున్నారు. స్వ‌గ్రామంలో వ్య‌వ‌సాయం చేయ‌డానికి ఆమె సిద్ధ‌మ‌య్యారు. ట్రాక్ట‌ర్‌తో పొలం దున్నుతున్న వీడియోను ఇటీవ‌ల ఆమె విడుద‌ల చేశారు. తాజాగా పొలంలో నాట్లు వేస్తున్న వీడియోను సోష‌ల్ మీడియాలో ఆమె షేర్ చేశారు.

దేశానికి వెన్నెముక‌గా నిలిచే రైతుకు అండ‌గా నాట్లు వేస్తూ న‌టి కీర్తీ షేర్ చేసిన వీడియో స్ఫూర్తిదాయ‌కంగా ఉంద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అవ‌స‌ర‌మైతే వ్య‌వ‌సాయం చేయ‌డానికి కూడా వెనుకాడ వ‌ద్ద‌నే సందేశాన్ని పంపార‌ని కీర్తీపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.