వైఎస్‌ జగన్‌కి మొదలైన ‘కోటి’ కష్టాలు

రాష్ట్రాన్ని, రాష్ట్ర రాజకీయాల్ని ఓ కుదుపు కుదిపేస్తోన్న ఎల్జీ పాలిమర్స్‌ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అత్యుత్సాహం ఇప్పుడు ఆయనకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ‘కోటి రూపాయల’ ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం విదితమే. నిజానికి, ఇది ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ నుంచి రాబట్టాల్సిన ఎక్స్‌గ్రేషియా. ‘మేమూ మేమూ తేల్చుకుంటాం..’ అని ముఖ్యమంత్రి అప్పటికి ఏదో లైటర్‌ వీన్‌లో చెప్పేసినా, అది జనంలోకి వేరే సంకేతాల్ని తీసుకెళ్ళింది.

తాజాగా ప్రకాశం జిల్లాలో జరిగిన ప్రమాదంలో 10 మంది రైతు కూలీలు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ‘కోటి రూపాయల’ ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలనే డిమాండ్లు తెరపైకొస్తున్నాయి. రాజకీయాల్లో ఈ తరహా డిమాండ్లు విపక్షాల నుంచి రావడం సహజమే. గతంలో వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు కోటి రూపాయలు కాకపోయినా, అడ్డగోలు డిమాండ్లనే తెరపైకి తెచ్చారు.

‘ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియాని ప్రకటించడం వ్యూహాత్మక తప్పిదమే’ అని అధికార పార్టీకి చెందిన కొందరు సీనియర్‌ నేతలు ఆఫ్‌ ది రికార్డ్‌గా అభిప్రాయపడ్తున్నారు. ఇందులో నిజం లేకపోలేదు కూడా.! మామూలుగా అయితే, ఘటనకు కారణమైన సంస్థ ముక్కు పిండి వసూలు చేయాలి బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇచ్చే క్రమంలో. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సంస్థకు సంబంధించిన ఇన్సూరెన్స్‌ వ్యవహారాలు, బాధితులకు పెద్దయెత్తున నష్టపరిహారం అందేందుకు వీలుగానే తీర్చిదిద్దబడి వుంటాయి.

కంపెనీలు ప్రారంభించేటప్పుడు ఒప్పందాల్లోనూ ఎక్స్‌గ్రేషియా వ్యవహాలు, ప్రమాదాలకు సంబంధించిన అంశాలు జోడించి వుంటాయి. ఆ సంగతి పక్కన పెడితే, రైతు కూలీలను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని ప్రకాశం జిల్లాలో జరిగిన ప్రమాదంపై అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ‘అది ఫ్యాక్టరీ వ్యవహారం.. ఇది వేరే వ్యవహారం..’ అని అధికార పార్టీ నేతలు బుకాయింపులు కొనసాగిస్తున్నా.. వారి మదిలోనూ, వైఎస్‌ జగన్‌ అత్యుత్సాహంపై అసహనం స్పష్టంగానే కన్పిస్తోంది. ఇప్పటితో కథ అయిపోలేదు.. ఇంకో నాలుగేళ్ళ పాలనలో వైఎస్‌ జగన్‌, ఈ ‘కోటి’కి సంబంధించి చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వుంటుంది.