ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే తెలంగాణ ధనిక రాష్ట్రం. అయినాగానీ, తెలంగాణతో పోల్చి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల అమలు విషయంలో వైఎస్ జగన్ సర్కార్.. శక్తికి మించి కష్టపడ్తోందన్నది నిర్వివాదాంశం. అయితే, సంక్షేమ పథకాల అమలులో కావొచ్చు.. ఇతరత్రా విషయాల్లో కావొచ్చు, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి డబ్బుల్ని వెదజల్లుతున్నప్పటికీ.. అధికార పార్టీ నేతల నిర్వాకంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది.
విశాఖలో గ్యాస్ లీక్ వ్యవహారాన్నే తీసుకుంటే.. తక్కువ సమయంలోనే బాధిత కుటుంబాలకు భారీ స్థాయిలో పరిహారాన్ని అందజేయగలిగింది ప్రభుత్వం. ఇంకా కొందరికి పరిహారం అందాల్సి వున్నప్పటికీ.. గతంలో ఎన్నడూ లేని విధంగా మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం అందించడం గమనార్హం. కానీ, ఎక్కడో లోపం జరుగుతోంది.
బాధిత కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నాయి. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. బాధితుల్ని గుర్తించడంలో గ్రౌండ్ లెవల్లో తప్పులు దొర్లుతున్నాయి. అదే ప్రభుత్వానికి శాపంగా మారుతోంది. మంత్రులు, గ్యాస్ లీక్ అయిన ప్రాంతాల్లో బస చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ, దానికోసం ఫొటో, వీడియో షూట్లు చేయించుకోవడంతో అసలు ఉద్దేశ్యం నీరుగారిపోయింది.
పశువులకు గడ్డిపెట్టే విషయంలో కూడా ఫొటోల మీద ఫోకస్ పెట్టారు మంత్రులు. ఒక్క ఈ విషయంలోనే కాదు, చాలా విషయాల్లో మంత్రుల అత్యుత్సాహం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోంది. అమరావతి విషయంలోనూ అంతే. మంత్రులే అనవసర రచ్చకు తెరలేపారు.
ఇక, సలహదారుల నుంచి కూడా సరైన సలహాలు ప్రభుత్వానికి అందడంలేదన్న విమర్శలున్నాయి. సరైన సమయంలో సరైన సలహాలు ప్రభుత్వానికి ఇచ్చేందుకే సలహాదారుల నియామకం జరుగుతున్నా.. సలహాదారుల్లో చాలామంది పూర్తిస్థాయిలో విఫలమవుతున్నారు. ‘మేమెందుకు సమాధానం చెబుతాం.? మాకేంటి సంబంధం.?’ అని ఓ సలహాదారుడు జాతీయ మీడియా చర్చ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు.. అందర్నీ విస్మయానికి గురిచేశాయి. సంబంధం లేకపోతే, ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం ఎందుకు అందుకుంటున్నట్లు.? అన్న ప్రశ్న ప్రజల నుంచి రాకుండా వుంటుందా.?
ఇటు సలహాదారులు, అటు మంత్రులు.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటే, వారి మీద ముఖ్యమంత్రికి సైతం సరైన ‘పట్టు’ లేదనే అనుకోవాల్సి వస్తుందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వైసీపీలో కొందరు నేతలు కూడా ఇదే విషయమై అంతర్గతంగా ఆవేదన చెందుతున్నారట. ‘జగన్ కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతోంది..’ అంటూ పార్టీలోనే చర్చ జరుగుతున్న మాట నిజమైతే.. తక్షణం డ్యామేజీ కంట్రోల్ చర్యలకు ముఖ్యమంత్రి దిగాల్సిందే.