హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌ జగన్‌ ప్రయత్నిస్తోంది.

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారాల్లోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ హైకోర్టు ఎప్పటికప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తూనే వుంది. అలా మొట్టికాయ తగిలిన ప్రతిసారీ, ‘టీడీపీ కుట్ర..’ అనడం వైసీపీకి పరిపాటిగా మారిపోయింది. ‘చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్‌ చేయడంలో దిట్ట..’ అంటూ నెపం చంద్రబాబు మీద వేసేసి చేతులు దులుపుకుంటున్నారు వైసీపీ నేతలు. చిత్రంగా మంత్రులు కూడా ఇవే తరహా ‘సిల్లీ కామెంట్స్‌’ చేస్తున్నారు.

నిజానికి, న్యాయస్థానాల్లో విన్పించే వాదనల్ని బట్టి.. ఆ వాదనల్లో వాస్తవాన్ని బట్టి తీర్పులు వస్తుంటాయి. ప్రభుత్వం తరఫు వాదనల్లో పస లేకపోవడంతోనే ప్రతిసారీ న్యాయస్తానాల్లో ప్రభుత్వానికి మొట్టికాయలు పడుతున్నాయి. వైసీపీ జెండా రంగుల విషయానికొస్తే, న్యాయస్థానాలు ఎన్నిసార్లు మొట్టికాయలేసినా ప్రభుత్వంలో మార్పు రావడంలేదు.

అమరావతిలో పేదలకు ఇళ్ళ స్థలాలంటూ ప్రభుత్వం చేసిన పొలిటికల్‌ పబ్లిసిటీ స్టంట్‌కి కూడా ఇలాగే షాక్‌ తగిలింది. రాజధాని కోసం సేకరించిన భూముల్లోనే ఎందుకు.? వేరే ప్రాంతంలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వొచ్చుకదా.? అన్నది లాజిక్‌తో కూడిన ప్రశ్నే. కానీ, ఆ లాజిక్‌ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఈ సమస్య వస్తోంది. ఇక, ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బ తగిలిన ప్రతిసారీ, సోషల్‌ మీడియా వేదికగా వైసీపీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు.. చంద్రబాబుని తూలనాడుతున్నారు.. కొందరైతే న్యాయస్థానాల మీదా అవాకులు చెవాకులు పేలడానికి వెనుకాడటంలేదు.

వైసీపీకి చెందిన ఓ ప్రజా ప్రతినిది¸, ఇటీవల న్యాయస్థానంపై విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారాన్ని పెట్టీ కేసుగా కొట్టి పారేశారాయన. ఏ కేసు ఎలాంటిదో హైకోర్టుకి ఓ ప్రజా ప్రతినిది¸.. పైగా అనేక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పాఠాలు చెబుతాడా.? నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది వ్యవహారం.

‘ప్రభుత్వం దగ్గర సరైన సలహాదారులు లేరు.. న్యాయస్థానంలో వాదనలు విన్పించాల్సిన విభాగం కూడా సమర్థవంతంగా పనిచేయడంలేదు.. న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి పదే పదే మొట్టికాయలు పడటానికి ఇదీ ఓ కారణమే..’ అని ఓ రాజకీయ పరిశీలకుడు తన అభిప్రాయాన్ని ఓ ఛానల్‌ చర్చా కార్యక్రమంలో వెల్లడించడం గమనార్హం. మొత్తమ్మీద, తమ వైఫల్యాలను గుర్తెరగకుండా.. వైసీపీ శ్రేణులు.. టీడీపీకి పరోక్షంగా క్రెడిట్ ఇచ్చి, వారిని టార్గెట్ చేస్తుండడం రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది.