సీఎం జగన్ ఏడాది పాలనలో సాగించిన విధ్వంసం గురించి మహానాడు వేదికగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తూర్పారబట్టారు. కరోనా నేపథ్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మంగళగిరి నుంచి మహానాడు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో పాలన ‘జంగిల్ రాజ్’లా తయారైందని ధ్వజమెత్తారు. ప్రజావేదిక మొదలుకుని తాజాగా విజయనగరంలో మూడులాంతర్ల స్తంభం కూల్చివేత వరకు… విధ్వంసక పాలన సాగిస్తున్నారని విమర్శించారు.
జగన్ పాలన ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోందంటూ అనేక అంశాలను బాబు ప్రస్తావించారు. మూడు రాజధానుల పేరుతో జగన్…బాబు కలల రాజధాని అమరావతిని విధ్వంసం చేయడాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. నిజమే లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని జగన్ ఒకే ఒక్క నిర్ణయంతో ధ్వంసం చేశారు.
కానీ చంద్రబాబు మహానాడు వేదికగా చెప్పాల్సిన ప్రధాన విధ్వంసం గురించి చెప్పనే లేదు. నిజానికి ఈ విధ్వంసం గురించి చెప్పి ఉంటే టీడీపీకి ఎంతోకొంత ప్రయోజనకారిగా ఉండేది. తొలిరోజు మహానాడు అసాంతం స్వయం స్తుతి, పరనిందగా తయారైంది. కాని జగన్ చేసిన విధ్వంసం మాత్రం బాబును కలలో కూడా వెంటాడుతోంది. అయినప్పటికీ దాని గురించి స్మరించుకోడానికి , ప్రజలకు చెప్పడానికి బాబుకు ధైర్యం లేదు. జగన్ చేసిన ఆ మహా విధ్వంసం గురించి చెప్పాలంటే బాబుకు ఎంతో సంస్కారం ఉండాలి.
ఎందుకంటే ఆ విధ్వంసం గురించి మహానాడులో చర్చించుకోవడం అంటే టీడీపీ ఆత్మపరిశీలన చేసుకోవడమే. 38 ఏళ్ల క్రితం తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో విఖ్యాత నటుడు ఎన్టీఆర్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. పువ్వు పుట్టగానే పరిమళించిన చందంగా…పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే తెలుగు ప్రజల ఆదరాభిమానాలను చూరగొంది. నాడు కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో సహా పెకలించి, మహామహులను ఎన్నికల క్షేత్రంలో మట్టి కరిపించిన ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీ సొంతం.
అయితే 1989లో ఎన్టీఆర్ పాలనలో అనేక తప్పిదాల వల్ల టీడీపీ ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన పాత పాలనా విధానాలతో తిరిగి 1994లో అధికారాన్ని టీడీపీకి అప్పగించింది. 1994లో ఎన్టీఆర్ నేతృత్వంలో టీడీపీ తిరిగి పాలనా పగ్గాలు చేపట్టింది. అయితే 1995లో టీడీపీ అంతర్గత రాజకీయాల్లో కారణంగా ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేశారు. దీనికి ఎన్టీఆర్ అల్లుడైన చంద్రబాబు నాయకత్వం వహించడం గమనార్హం. సొంత అల్లుడే తన ప్రభుత్వాన్ని కూలదోయడంతో ఎన్టీఆర్ మానసికంగా కుంగిపోయారు. అదే ఆయన మరణానికి కారణమైంది. నాటి నుంచి నారా చంద్రబాబునాయుడు కాస్తా వెన్నుపోటు బాబుగా సమాజంలో ప్రత్యేక గౌరవ మర్యాదలు సంపాదించుకున్నారు.
తొమ్మిదేళ్లు పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు…ఇక తనకు ఎదురే లేదని ఇష్టానుసారం పాలన సాగించారు. ఈ నేపథ్యంలో 2004లో డాక్టర్ వైఎస్సార్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీని ఎన్నికల్లో ఘోరంగా ఓడించింది. ఆ తర్వాత 2009లో కూడా చంద్రబాబుకు వైఎస్ చేతిలో పరాజయం తప్పలేదు. అనంతరం వైఎస్సార్ ఆకస్మిక మరణం రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఏది ఏమైతేనేం రాష్ట్రం విడిపోవడం, 2014లో టీడీపీ-బీజేపీ మిత్రపక్షం విజయం సాధించడం, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రికార్డులకెక్కారు.
ఐదేళ్ల పాలనలో అప్రజాస్వామిక విధానాలతో ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం ముప్పుతిప్పలు పెట్టింది. ఈ నేపథ్యంలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లకు గాను కేవలం 23 సీట్లలో మాత్రమే టీడీపీ గెలుపొందింది. అలాగే మూడు ఎంపీ సీట్లను దక్కించుకుంది. ప్రతిపక్ష వైసీపీ 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లను దక్కించుకొంది. గతంలో ఎప్పుడూ లేనంత ఘన విజయాన్ని జగన్ నేతృత్వంలోని వైసీపీ సాధించింది.
ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన అతి పెద్ద విధ్వంసం ఏదైనా ఉందంటే అది టీడీపీని భూస్థాపితం చేయడమే. భవిష్యత్‌లో టీడీపీ కోలుకోలేని విధంగా జగన్ మహా విధ్వంసానికి తెగబడ్డారనడలో ఎలాంటి సందేహం లేదు. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత ఈ 38 ఏళ్లలో ఏనాడూ ఇంత ఘోర పరాజయాన్ని చూసిన దాఖలాలు లేవు. అసలు కలలో కూడా ఊహించనంతగా బాబు నాయక త్వంలోని టీడీపీని జగన్ మట్టి కరిపించారు. ఆ విధ్వంసం ముందు…బాబు పదేపదే చెబుతున్న ప్రజావేదిక , అమరావతి రాజధాని, విజయనగరంలోని మూడు లాంతర్ల స్తంభాలు ఏపాటివి. అసలు సిసలు విధ్వంసం గురించి అంతర్మథనం, మేధోమథనం చేస్తే భవిష్యత్‌లో పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశాలుంటాయి. కానీ ఆ దిశగా మహానాడులో చర్చ జరగకపోవడం విచారకరం.