ఏపీ సీఎం జగన్ తీరుపై, వైకాపా ప్రభుత్వంపై మాజీ మంత్రి శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు తీవ్ర విమర్శలు గుప్పించాడు. అర్హత ఉన్నా కూడా వైకాపా కాదనే ఉద్దేశ్యంతో వారికి పెన్షన్ ఇవ్వక పోవడంతో పాటు పలు సంక్షేమ పథకాలు కూడా వైకాపా కు చెందిన వారికే ఇస్తున్నట్లుగా ఆయన ఆరోపించాడు. ఏపీ మంత్రి, డిప్యూటీ సీఎం అయిన పుష్ప శ్రీ వాణి మామ అయిన చంద్రశేఖర్ రాజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై రాజకీయంగా ఒత్తిడి మొదలయ్యింది.
తాజాగా ఒక కార్యక్రమంలో శత్రుచర్ల మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రోడ్లు సరిగా లేవు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది కార్యక్రమాలు మొక్కుబడిగా సాగుతున్నాయి. ఎన్నో సాగునీటి ప్రాజెక్ట్‌లు ఆగిపోయాయి. ఇక గతంలో వైఎస్‌ఆర్ అందరికి ఇల్లు ఇచ్చేవారు. కాని ఇప్పుడు జగన్ మాత్రం పార్టీ చూసి మరీ ఇస్తున్నట్లుగా విమర్శలు చేశాడు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో అభివృద్ది మందగించింది. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రజలు జగన్‌పై తిరగడబడటం ఖాయం అంటూ ఆయన హెచ్చరించాడు. మంత్రికి స్వయాన మామ అయిన శత్రుచర్ల ఇలా మాట్లాడటంతోనే వైకాపా పరిపాలన తీరు అర్థం అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.