ఒకవైపు ఎన్టీఆర్ అభిమానులు నటి మీరా చోప్రాకు జారీ చేసిన అత్యాచార హెచ్చరికల అంశం వార్తల్లో ఉండగా, మరో మహిళా ప్రముఖురాలికి అలాంటి హెచ్చరికలే జారీ చేశారు కొంతమంది అతిగాళ్లు. ఈ సారి వంతు నిర్మాత ఏక్తా కపూర్ ది. ఈమె నిర్మాణంలో రూపొందిన ఏదో కార్యక్రమంలో మిలటరీ గురించి అభ్యంతరకమైన వ్యాఖ్యలు ఉన్నాయట. ఆ విషయంపై స్పందిస్తూ కొంతమంది ఏక్తాను అత్యాచారం చేస్తామని హెచ్చరించడంతో పాటు, ఆమె తల్లిని కూడా దూషించారట. ఈ మేరకు ఏక్తా వాపోతూ ఉంది.
తాము రూపొందించిన కార్యక్రమంలో అభ్యంతరాల గురించి తాము ఇది వరకే స్పందించినట్టుగా ఏక్తా వివరించింది. ఆ ప్రోగ్రామ్ ను ఎడిట్ చేసినట్టుగా, అభ్యంతరాలు వచ్చిన అంశాలను కట్ చేసినట్టుగా ఏక్తా వివరించింది. అయితే తామే దేశభక్తులయినట్టుగా కొంతమందిని తమను దూషిస్తూ ఉన్నారని ఏక్తా వాపోతోంది. అత్యాచారం చేస్తామంటూ తనను హెచ్చరించడమే దేశభక్తి అని వాళ్లు ఫీలవుతున్నట్టుగా ఉన్నారని ధ్వజమెత్తింది.
తమ వెబ్ సీరిస్ లో అభ్యంతరాలు ఉండటానికి, తమకు ఆ తరహా హెచ్చరికలు జారీ చేయడానికి సంబంధం ఏమిటని ఆమె ప్రశ్నించింది. అభ్యంతరాల నేపథ్యంలో తాము ప్రోగ్రామ్ ను ఎడిట్ చేసినట్టుగా, కొంతమంది పోలీసులకు చేసిన ఫిర్యాదులు వేరే కథ కాగా.. మరి కొందరు మాత్రం నీఛమైన కామెంట్లతో తమను మానసికంగా హింస పెడుతున్నారని ఏక్తా అంటోంది. సోషల్ మీడియాలో ఆడవాళ్లకు ఈ తరహా హెచ్చరికలు కొత్తవి కాకుండా పోయాయి. తమకు నచ్చని రీతిలో స్పందించిన ఆడవాళ్లను రేప్ చేస్తామంటూ కామెంట్ పెట్టేయడం కొంతమంది మానసిక రోగులకు అలవాటుగా మారినట్టుంది.