కొద్దిరోజుల క్రితం సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ముందుగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ని కలిసి సినిమా, టివి షూటింగులకు, పోస్టు ప్రొడక్షన్ పనులు ఎప్పుడు ప్రారంభించాలి, సినిమా థియేటర్లను ఎప్పుడు తెరుచుకోవచ్చు అనేదానిపై ముచ్చటించారు. ఆ తర్వాత ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి వివరించగా ఆయన సానుకూలంగా స్పందించి విధి విధానాలు రూపొందిచాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సినీరంగ ప్రముఖులు సమావేశమై విధివిధానాలను రూపొందించి నేడు సీఎం కేసీఆర్ కి అందజేశారు.
వాటిని పరిశీలించిన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు నేడు కోవిడ్ 19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవడానికి అనుమతి ఇచ్చారు. దానికి సంబంధించిన ఫైలుపై కూడా కేసీఆర్ సంతకం చేశారు. రాష్ట్రంలో పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు చేసుకోవచ్చు. అలాగే షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి స్థాయిలో వెంటనే నిర్వహించుకోవచ్చని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కానీ థియేటర్స్ విషయంలో మాత్రం రాష్ట్రంతో పాటు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సి ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం అనుమతి థియేటర్స్ ఓపెనింగ్స్ కి నో చెప్పింది.