నందమూరి బాలకృష్ణ గత ఏడాది మామూలు ఎదురు దెబ్బలు తినలేదు. ఎన్నో ఆశలతో, అంచనాలతో చేసిన ‘యన్.టి.ఆర్’ బాలయ్యకు కెరీర్లోనే అతి పెద్ద షాకిచ్చింది. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం పాతిక కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది. అందులోనూ రెండో భాగం అయితే మూడున్నర కోట్ల షేర్‌కు పరిమితమైంది. ఆ పరాభవం నుంచి బయటపడదామని హడావుడిగా చేసిన ‘రూలర్’ మరింత చేదు అనుభవాన్ని మిగిల్చింది. బాలయ్య మార్కెట్ ఏడాది వ్యవధిలో మొత్తం తల్లకిందులైపోయింది.
ఈ దెబ్బకు బాలయ్య కొత్త సినిమాల బడ్జెట్లు తగ్గించుకుని, ఆయన పారితోషకంలోనూ కోత వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ‘రూలర్’ కంటే ముందే ఖరారైన బోయపాటి సినిమా విషయంలో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి పునరాలోచనలో పడ్డాడు. మళ్లీ బడ్జెట్, ఇతర వ్యవహారాలపై సమీక్ష చేయాల్సి వచ్చింది. ఒక దశలో రవీందర్ రెడ్డి సినిమా నుంచి తప్పుకుందామా అన్న ఆలోచన కూడా చేశాడు.
వెంటనే మరో నిర్మాత దొరికే పరిస్థితి లేకపోవడంతో రవీందర్ రెడ్డి చెప్పిన మేరకు బడ్జెట్ కోతలు వేసుకుని సినిమా చేయడానికి బోయపాటి అంగీకరించాడు కూడా. అయినా సరే.. బాలయ్య-బోయపాటి సినిమా అంటే సినిమా రిచ్‌గా తీయాల్సిందే. దీంతో బడ్జెట్, బిజినెస్ విషయంలో నిర్మాతను భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. బాలయ్య మార్కెట్ దారుణంగా దెబ్బ తినేయడం, బోయపాటి చివరి సినిమా డిజాస్టర్ కావడంతో వీళ్ల కలయికలో వస్తున్న కొత్త సినిమాకు క్రేజ్ ఉంటుందా.. సినిమాకు అనుకున్న మేర బిజినెస్ జరుగుతుందా అన్న సందేహాలు ఆయన్ని వెంటాడాయి.
కానీ ఒక్క రోజు వ్యవధిలో ఈ పరిస్థితి మొత్తం మారిపోయింది. నిమిషం టీజర్ ఆయన కోరుకున్న మ్యాజిక్ చేసేసింది. మొన్న రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్.. ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేసింది. టీజర్ కొత్తగా ఏమీ లేదు కానీ.. ఈ కాంబినేషన్ నుంచి ఆశించే మాస్ అంశాలకు లోటు లేదు. బాలయ్య ఈజ్ బ్యాక్ అనిపించిందీ ఫస్ట్ రోర్. ఈ టీజర్‌కు 36 గంటల వ్యవధిలో 6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెరగడమే కాదు.. ట్రేడ్ వర్గాల నుంచి ఇప్పటికే ఆరాలు, ఆఫర్లు మొదలైపోయినట్లు సమాచారం. దీంతో ఇన్నాళ్లూ టెన్షన్లో ఉన్న నిర్మాత.. ఇప్పుడు హమ్మయ్య అనుకుంటున్నాడట. ఇక ఆయన సినిమాపై స్వేచ్ఛగా ఖర్చు పెట్టి మంచి ఔట్ పుట్ తెచ్చే పనిలో పడనున్నాడట.