2021 సమ్మర్ మాములుగా ఉండదంటున్న స్టార్ ప్రొడ్యూసర్

2020 ఆరంభం టాలీవుడ్ కు బాగా కలిసొచ్చింది. సంక్రాంతికి విడుదలైన రెండు భారీ సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి పోటీ పడి ఆడడంతో కలెక్షన్స్ ఓ రేంజ్ లో నమోదయ్యాయి. ఇక ఫిబ్రవరిలో కూడా భీష్మ రూపంలో హిట్ దొరికింది. అయితే ఆ తర్వాత నుండి కరోనా కారణంగా లాక్ డౌన్ పడడంతో టాలీవుడ్ కు కీలకమైన సమ్మర్ మొత్తం ఎగిరిపోయింది. డజనుకు పైగా సినిమాలు విడుదల కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఆగస్ట్ వరకూ థియేటర్లు తెరవడం అనేది కష్టమైన వ్యవహారం అని చెప్పుకోవచ్చు.

ఒకవేళ తెరిచినా ప్రేక్షకులు ఎంతవరకూ థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపుతారన్నది ప్రశ్నార్ధకమే. ప్రస్తుతం షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసినా అవన్నీ ఖాళీగా దర్శనమిస్తున్న సంగతి తెల్సిందే. దీంతో థియేటర్లకు కూడా ఈ ఏడాదంతా కష్టకాలం నడవనుంది. అయితే వచ్చే ఏడాది ఈ కష్టాలన్నీ తొలగిపోతాయని అంటున్నాడు ప్రముఖ నిర్మాత బన్నీ వాసు. గీతా ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ 2 వ్యవహారాలలో కీలకంగా ఉండే బన్నీ వాసు ఈ మేరకు స్పందించాడు.

టాలీవుడ్ ఈ ఏడాది పోగొట్టుకున్నదంతా వచ్చే ఏడాది వసూలు చేసుకుంటుందని అంటున్నాడు. ముఖ్యంగా వచ్చే ఏడాది సమ్మర్ టాలీవుడ్ కు విపరీతంగా కలిస్తుందని, బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం ఖాయమని కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. మరి కాన్ఫిడెన్స్ వరకూ ఓకే కానీ నిజంగానే అలా జరిగితే టాలీవుడ్ కు అంతకన్నా కావాల్సింది ఏముంది.