నాగార్జున కెరీర్ పరంగా ఈమద్య కాలంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. మన్మధుడు 2 చిత్రంతో నాగార్జున ఆలోచన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఆయన సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే ప్రయోగాత్మక చిత్రం వైల్డ్ డాగ్ ను చేసేందుకు కమిట్ అయ్యాడు. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేసేందుకు నాగార్జున ఓకే చెబుతున్నాడు. ఈ సమయంలో మరో ప్రయోగంకు నాగ్ సిద్దం అయ్యాడు.
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ సునీల్ నిర్మాతగా మారి నాగచైతన్య, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని నిర్మించిన విషయం తెల్సిందే. ఆ సినిమాను త్వరలో విడుదల చేయబోతున్నారు. తాజాగా ఏషియన్ సునీల్ తన రెండవ సినిమాను కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనే అంటూ ప్రకటించాడు. ఆ రెండు కాకుండా సునీల్ ఇటీవల నాగార్జునతో కూడా సినిమాకు ఒప్పందం కుదుర్చుకున్నాడట. ఆ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత అయిన ప్రవీన్ సత్తారు దర్శకత్వం వహించబోతున్నాడు.
గరుడవేగ అనే విభిన్నమైన సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు మరో విలక్షణమైన కథను నాగార్జునకు వినిపించడం ఆయన ఓకే చెప్పడం జరిగి పోయిందట. మొదట ఈ దర్శకుడు పుల్లెల గోపీచంద్ బయోపిక్‌ను తెరకెక్కించాలని భావించాడు. కాని అంతకు ముందే నాగార్జునతో మూవీని చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ కాంబోకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.