ఇన్‌సైడ్‌ స్టోరీ: లోకేష్‌ అరెస్టయితే.. గగ్గోలు పెట్టేదెవరంట.?

వైసీపీ నేతల మాటలు చూస్తోంటే రేపో మాపో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌ కూడా ఏదో ఒక కేసులో అరెస్టయ్యేలానే కన్పిస్తోంది. ‘లోకేష్‌ అయినా, చంద్రబాబు అయినా.. చట్టం నుంచి తప్పించుకోలేరు.. మేం మొదటి నుంచీ ఒకే మాట మీద వున్నాం. చంద్రబాబు హయాంలో అవినీతి జరిగింది.. ఆ అవినీతికి బాధ్యులైనవారెవర్నీ ఉపేక్షించేది లేదు.. ఇది కక్ష పూరిత చర్యలు కావు.. ప్రజాధనాన్ని లూటీ చేసిన రాజకీయ నాయకుల పని పడుతున్నాం..’ అని వైసీపీ నేతలు చెబుతున్నారు.

అదిగో లోకేష్‌ అరెస్ట్‌.. ఇదిగో లోకేష్‌ అరెస్ట్‌.. అంటూ సోషల్‌ మీడియా నిండా కుప్పలు తెప్పలుగా కామెంట్లు కన్పిస్తున్నాయి. మొత్తంగా టీడీపీ పాలనలో జరిగిన అవినీతికి నారా లోకేష్‌ కీలక సూత్రధారి అన్నది వైసీపీ ఆరోపణ. దాంతో, ఏ కేసులో అయినా నారా లోకేష్‌ పేరు తెరపైకి రావడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.

అచ్చెన్నాయుడు అరెస్ట్‌ వ్యవహారంలో బీసీ కార్డుని వాడేసిన టీడీపీ, జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహారంలో ‘ఓసీ’ కార్డు వాడలేకపోయిన విషయం విదితమే. అచ్చెన్న వ్యవహారానికి సంబంధించి టీడీపీ యాగీ ఒక్క రోజులోనే చల్లారిపోయింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్‌ వ్యవహారానికి పెద్దగా మైలేజ్‌ దక్కలేదు కూడా. మరి, నారా లోకేష్‌ విషయంలో వైసీపీ చెబుతున్నదే నిజమైతే ఏంటి పరిస్థితి.? లోకేష్‌ తరఫున గట్టిగా నినదించే టీడీపీ నేతలెవరు.? ఇప్పుడీ చర్చ టీడీపీలో అంతర్గతంగా చాలా గట్టిగానే సాగుతోంది.

అప్పుడిక చంద్రబాబు యాగీ చేసినా ఉపయోగం వుండదు. చంద్రబాబు, ఈ రోజు అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వెళితే, కోవిడ్‌ నిబంధనల్ని చూపుతూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ చంద్రబాబుకి ‘రెడ్‌ సిగ్నల్‌’ ఇచ్చేశారు. దాంతో చంద్రబాబు వెనుదిరగక తప్పలేదు. కొద్ది రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అక్కడ చంద్రబాబు పరిస్థితేంటి.? ఈలోగానే లోకేష్‌ అరెస్ట్‌ వ్యవహారం ఏమన్నా జరిగితేనో.! ఈ భయం ఇప్పుడు టీడీపీలో స్పష్టంగా కన్పిస్తోంది.