పెదబాబు.. అదేనండీ చంద్రబాబు.. ఆయన తనయుడు చినబాబు (నారా లోకేష్) పరిస్థితి ఏంటి.? అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెగ వెటకారాలు చేసేశారు సోషల్ మీడియాలో. ట్విట్టర్లో యాక్టివ్‌గా వుండే విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్ట్ తదనంతర పరిణామాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో అచ్చెన్నాయుడితోపాటు అరెస్టయిన అధికారులు, పోలీసులకు అన్ని వివరాలూ చెప్పేశారట. మంత్రిగారి ఒత్తిడి మేరకే అక్రమాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారట. దాంతో, అచ్చెన్నాయుడికి శిక్ష తప్పదట.
ఒకవేళ అచ్చెన్నాయుడే అప్రూవర్‌గా మారితే చంద్రబాబు, చినబాబు పరిస్థితి ఏంటన్నది విజయసాయిరెడ్డి ప్రశ్న. పైగా, గంటకు 5 లక్షల చొప్పున ఫీజు తీసుకునే గొప్ప గొప్ప న్యాయవాదుల వద్దకు చంద్రబాబు, చినబాబు వెళుతున్నారంటూ విజయసాయిరెడ్డి వెటకారం చేశారు. ఏమో, ఆ ప్రయత్నాలు జరుగుతాయేమో.. జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనేముంది.? వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు సందర్భంగా వైఎస్ జగన్‌తోపాటు విజయసాయిరెడ్డి చేసిందేంటట.? అంటూ నెటిజన్లు విజయసాయిరెడ్డిని ట్విట్టర్లోనే ప్రశ్నిస్తున్నారు. ‘ఆ పెద్ద పెద్ద లాయర్లకు అంత పెద్ద మొత్తంలో డబ్బులివ్వడం అలవాటు చేసింది మీరే కదా..’ అని కూడా నెటిజన్లు ప్రశ్నిస్తుండడం గమనార్హం.