వైసీపీలో ముదిరి పాకాన పడ్తున్న ‘రాజుగారి పంచాయితీ’

‘అబ్బే, మేమంతా కలిసిపోతాం.. మొగుడూ పెళ్ళాల మధ్య చిన్నపాటి విభేదాల్లాంటిదే మా మధ్య గొడవ కూడా..’ అంటూ కొద్ది రోజుల క్రితమే ఓ ప్రముఖ న్యూస్‌ ఛానల్‌ చర్చా కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లాకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నర్సాపురం లోక్‌సభ ఎంపీ రఘురామకృష్ణరాజు మధ్య ‘ఒప్పందం’ కుదిరింది. సదరు ఛానల్‌కి వైసీపీతో వున్న అనుబంధం నేపథ్యంలో ఎలాగోలా కష్టపడి ‘నారదుడు’ లాంటి యాంకర్‌, ఆ ‘పంచాయితీ’ని అలా సెటిల్‌ చేశారని అప్పట్లో అటు రాజకీయాల్లోనూ, ఇటు మీడియా వర్గాల్లోనూ చర్చ జరిగింది.

అయితే, పంచాయితీ అక్కడితో అయిపోలేదు. నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజుకి వ్యతిరేకంగా నినాదాలు కొనసాగుతూనే వున్నాయి.. దిష్టిబొమ్మల దహనాలూ జరుగుతున్నాయి. కొందరైతే అత్యుత్సాహం చూపిస్తూ, ఎంపీపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామకృష్ణరాజు ‘ప్రొటెక్షన్‌’ కోసం పోలీసుల్ని ఆశ్రయించారు తన పర్సనల్‌ సెక్రెటరీ ద్వారా. దాంతో, కథ కొత్త మలుపు తిరిగింది.

పోలీసులు, ఇప్పుడు ఈ ఫిర్యాదుపై ఎలా స్పందిస్తారు.? అన్న విషయమై అటు వైసీపీతోపాటు, ఇటు వైసీపీ ప్రత్యర్థి పార్టీలూ ఎదురుచూస్తున్నాయి. సోషల్‌ మీడియాలో అభ్యంతకరమైన పోస్టులు పెట్టారని ఓ ఎంపీ ఫిర్యాదు చేస్తే చాలు.. పోలీసులు ఆఘమేఘాల మీద నోటీసులు జారీ చేయడం, అరెస్టులు చేయడం వంటివి చేసేస్తున్న దరిమిలా.. ఇప్పుడు ఎంపీ రఘురామకృష్ణరాజు తరఫున ఆయన పీఎస్‌ చేసిన ఫిర్యాదుపై ఎవర్ని అరెస్ట్‌ చేస్తారు.? ఎంపీ కోరిన ప్రొటెక్షన్‌ని ఎలా ఇస్తారు.? అన్నది చర్చనీయాంశంగా మారింది.

రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. ‘పోలీసులు అధికార పార్టీలకు తొత్తులు’ అన్న విమర్శలు ఈనాటివి కావు. టీడీపీ హయాంలో వైసీపీ విమర్శించింది ఇలానే.. ఇప్పుడు వైసీపీ హయాంలో టీడీపీ ఆరోపిస్తోంది. అంతిమంగా పోలీసుల మీద మాత్రం పొలిటికల్‌ ప్రెజర్‌ సుస్పష్టం. కాగా, రఘురామకృష్ణరాజు తనతోపాటు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకెళ్ళబోతున్నారు.. అనే ప్రచారం దరిమిలా, వైసీపీ అధిష్టానం అలర్ట్‌ అయ్యింది. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిథులే కాదు.. పార్టీకి చెందిన కీలక నేతలందరితోనూ అధిష్టానం రఘురామకృష్ణరాజు వ్యవహారంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోందట.