జగన్ ప్రభుత్వంపై టీడీపీ ఎటాక్.. హైకోర్టులో ఎమ్మెల్సీ పిటిషన్

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల్ని అసెంబ్లీలో తిరిగి ప్రవేశపెట్టి, వాటిని శాసనమండలికి పంపడాన్ని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిని చట్టవిరుద్ధమైన చర్యగా చూడాలని ఆయన హైకోర్టును కోరారు. ఈ రెండు బిల్లుల్ని సెలక్ట్ కమిటీకి పంపిన అంశాన్ని పట్టించుకోకుండా ఈనెల 16న మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా పేర్కొన్నారు.

అసెంబ్లీలో బలం ఉందన్న నెపంతో అధికార పార్టీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తోందని అన్నారు. బిల్లులు ప్రవేశపెట్టాలంటే సంబంధిత మంత్రులు నిబంధన 90 ప్రకారం వారం ముందు నోటీసులు ఇవ్వాలన్న అంశాన్ని పట్టించుకోలేదని అన్నారు. సీఎం, మంత్రులు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మండలిలో చైర్మన్ నిర్ణయమే ఫైనల్ అని సుప్రీం చెప్పినా పట్టించుకోలేదని గుర్తు చేశారు.

మండలి రద్దు చేయాలని శాసనసభ చేసిన తీర్మానాన్ని పార్లమెంట్ కు పంపించడాన్ని రాజ్యాంగ విరుద్దమైన చర్యగా ప్రకటించాలని తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇది ఎమ్మెల్సీల హక్కుల్ని కాలరాసేదిగా ఉందన్నారు. పార్లమెంట్ లో చట్టం చేయకుండా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కార్యదర్శిని, లోక్ సభ సెక్రటరీ జనరల్ ను ఆదేశించాలని ఆయన కోరారు. చైర్మన్ ఆదేశాలను శాసనసభ కార్యదర్శ బాలకృష్ణమాచార్యులు పాటించలేదని తన పిటిషన్ లో పేర్కొన్నారు.