హోం క్వారంటైన్‌.. కరోనాతో కామెడీ చేస్తే ఎలా.?

దేశంలో నిన్న ఒక్కరోజే 35 వేల కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 10 లక్షల కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సరికొత్త రికార్డులు సృష్టించేస్తున్న పరిస్థితుల్ని చూస్తున్నాం.. కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల పరంగా. ఇంత పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నప్పుడు, మన దేశంలో వైద్య రంగానికి సంబంధించి వున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏమాత్రం సరిపోదు.. కరోనా బాధితులకు చికిత్స అందించడానికి. ఈ క్రమంలోనే హోం క్వారంటైన్‌కి ఐసీఎంఆర్‌ అనుమతినిచ్చింది.

స్వల్ప లక్షణాలున్న కరోనా బాధితుల్ని హోం క్వారంటైన్‌లో వుంచాలని ఐసీఎంఆర్‌ సూచించడంతో, రాష్ట్రాలు ఆ పనిలో బిజీగా వున్నాయి. కరోనా కిట్స్‌ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. వీటిల్లో గ్లవ్స్‌, మాస్క్‌లు, మందులు వంటివి వుంటున్నాయి. కానీ, ‘ఇంటిపట్టునే వుండి వ్యాధిని నయం చేసుకోవాలి.. బయటకెళ్ళి ఇతరులకు అంటించకూడదు..’ అన్న బుద్ధి ఎంతమందికి వుంటుంది.?

హైద్రాబాద్‌ పరిధిలో సుమారు 2 వేల మంది కరోనా బాధితుల ఆచూకీ కన్పించడంలేదంటూ అధికార యంత్రాంగమే చెబుతోంది. కరోనా కిట్స్‌ అందించేందుకు అధికారులు, బాధితులు ఇచ్చిన అడ్రస్‌లకు వెళితే, అక్కడ అధికారులకు బాధితుల ఆచూకీ దొరకలేదట. ఎంత నిర్లక్ష్యంగా జనం వ్యవహరిస్తున్నారనడానికి ఇదొక నిదర్శనం మాత్రమే.

ఆసుపత్రుల నుంచే కరోనా రోగులు పారిపోతున్న వైనం గురించి నిత్యం మీడియాలో చూస్తున్నాం. అలాంటిది, ఇంట్లో బుద్ధిగా వుండమంటే వుంటారా.? ఛాన్సే లేదు. ఒక్క హైద్రాబాద్‌లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఎవడి ప్రాణమ్మీద వాడికి భయం లేకపోతే.. అది వేరే చర్చ. కానీ, కరోనా రోగి బయటకు వెళ్ళి.. పది మందికి ఆ రోగాన్ని అంటిస్తే అది చాలా తీవ్రమైన అంశంగానే పరిగణించాల్సి వుంటుంది.

ఇక్కడ ప్రభుత్వాల బాధ్యతారాహిత్యం కూడా సుస్పష్టం. ‘మీ ఛావు మీరు ఛావండి..’ అన్న రీతిన, హోం క్వారంటైన్‌కి పంపించేసి చేతులు దులిపేసుకుంటే ఇలాగే వుంటుంది పరిస్థితి. హోం క్వారంటైన్‌పై ఖచ్చితమైన నిఘా వుండాలి. అలాగని, పూర్తిగా ప్రభుత్వాన్నే నిందిస్తూ కూర్చోవడం కూడా సబబు కాదు. ప్రతి పౌరుడూ ఈ కష్ట కాలంలో బాధ్యతగా మెలగాలి. మొత్తమ్మీద, కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకీ ఆందోళనకరమైన రీతిలో పెరిగిపోతోంటే.. ఇంకోపక్క నిర్లక్ష్యం అంతకన్నా దారుణంగా పెరిగిపోతోందన్నమాట.