బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ కోడలు ఐశ్వర్య రాయ్ మనవరాలు ఆరాధ్య బచ్చన్ లు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో ముంబయి నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇంకా పలువురు సినీ ప్రముఖులు కూడా కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కూడా కరోనా పాజిటివ్ అంటూ దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. తండ్రి నుండి విశాల్ కు కరోనా వ్యాప్తి చెందినట్లుగా తెలుస్తోంది.
ట్విట్టర్ లో ఈ విషయాన్ని విశాల్ స్వయంగా ప్రకటించాడు. ఔను నాన్నకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. నాకు కూడా అవే లక్షణాలు కనిపిస్తున్నాయి. నాన్నకు హెల్ప్ గా ఉన్న నాకు కూడా కరోనా వచ్చిందనే అనుమానం ఉంది. నా మేనేజర్ కూడా కరోనా లక్షణాలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మా కుటుంబ సభ్యులం అంతా కూడా స్వీయ నిర్భందంలో ఉన్నాం. ప్రస్తుతం మా ఆరోగ్యం బాగానే ఉందని ఆందోళన చెందాల్సిన పని లేదంటూ ఈ సందర్బంగా విశాల్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం తాను వైధ్యుల సూచన మేరకు ఆయుర్వేదిక్ మెడిషన్స్ తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు. అలాగే ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేందుకు వర్కౌట్స్ చేస్తున్నట్లుగా కూడా పేర్కొన్నాడు. ఈ విషయాన్ని షేర్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ విశాల్ చివర్లో కామెంట్ పెట్టి అందరిని ఆశ్చర్యపర్చాడు. వరుసగా చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విశాల్ కు కరోనా కారణంగా లాంగ్ బ్రేక్ వచ్చింది. ఈ బ్రేక్ ను కుటుంబ సభ్యులతో గడుపుతుండగా ఇలా కరోనా ఎటాక్ అయ్యింది. త్వరలోనే విశాల్ ఫ్యామిలీ మొత్తం కరోనా నుండి కోలుకోవాలని ఆయన అభిమానుల తరపున మా తరపున కోరుకుంటున్నాం.