భారమనేది శరీరానికి మాత్రమే సంబంధించింది కాదు. అంతకు మించి మనసుతో ముడిపడిన వ్యవహారం. శారీరక భారాన్నైనా దించుకోవచ్చు కానీ, మానసిక భారాన్ని దించుకోవడం ఒక్కోసారి జీవిత కాలం కూడా సరిపోదు. అది ఆయా మనుషుల వ్యక్తిగత సమస్యలు, అనుభవాలను బట్టి ఉంటుంది.
అందరినీ నవ్విస్తూ, కవ్విస్తూ హుషారుగా కనిపించే సహాయ నటి విద్యుల్లేఖ రామన్ శారీరక బరువుతో కాస్తా ఇబ్బంది పడుతూ ఉండేది. మరీ ముఖ్యంగా తన బరువు శరీరానికంటే కూడా ఆమె మనసును ఎక్కువగా ఇరిటేట్ చేసేది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పారు. ఇటీవల లాక్‌డౌన్‌లో పట్టుదలతో అనేక ఎక్సర్‌సైజ్‌లు చేసి ఏకంగా 20 కిలోల బరువు తగ్గి నాజూగ్గా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.
అయితే బరువు ఎందుకు తగ్గాల్సి వచ్చింది? లావుగా ఉండటం వల్ల ఎదుర్కొన్న సమస్యల గురించి విద్యుల్లేఖ తాజాగా తన అభిమానులతో పంచుకున్నారు. ‘ 20+ కేజీలు తగ్గడం అంటే ఇది శ్రమ, కన్నీరు, మలుపులతో కూడిన దూర ప్రయాణం. నేను షేర్ చేసిన ఫొటోలో ఎడమవైపు ఉన్న పిక్చర్ చూసినప్పుడు.. అలా ఉండ కూడదు, ఆరోగ్యంగా ఉండాలి అనుకున్నా.
ఆ ఫొటో తీసుకున్న రోజు నాకు ఇంకా గుర్తుంది. ఓ తమిళ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరుగుతోంది. ఆ వేడుకకు వెళ్లడానికి నాకు సరిపోయే దుస్తులు దొరకలేదు. నా వద్ద ఉన్న ఒక్క డ్రెస్ కూడా సరిపోలేదు. అందుకే లెగ్గిన్ వేసుకుని.. ఆ షేమ్‌ను దాచడానికి పైన కోటులాంటిది వేసుకున్నా. ఆ రోజు మానసిక ఒత్తిడితో పాటు నాపై నాకే చాలా కోపం వచ్చింది’ అని చెప్పుకొచ్చారామె.
2019, పిబ్రవరిలో కొన్ని అనుభవాల వల్ల తనలో తాను స్ఫూర్తి నింపుకున్నట్టు విద్యుల్లేఖ తెలిపారు. అప్పుడే తాను ఆరోగ్యం గా, ఫిట్‌గా తయారు కావాలని గట్టిగా నిర్ణయించుకుని, అందుకు తగ్గట్టు శ్రమించానని తెలిపారామె. ఆ తర్వాత తనలో వచ్చిన తేడాను ఈ ఫొటోలో మీరే చూడొచ్చు, ఏదైనా మన కోసం చేయాలంటూ ఆమె ఓ భావోద్వేగ పోస్టు పెట్టారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.