జయలలిత బయోపిక్ లో నటించడమే స్ఫూర్తిగా ఇచ్చిందో ఏమో కానీ అచ్చంగా రాజకీయ నేతలను ఫాలో అవుతోంది. తను ఝాన్సీ లక్ష్మీబాయి బయోపిక్ లో నటించినట్టుగా, తను కూడా ఝాన్సీ లక్ష్మినే అన్నట్టుగా చెప్పుకున్న కంగనా, తను జయలలిత బయోపిక్ లో కూడా నటించిన విషయాన్ని ప్రస్తావించడం లేదు ఇంకా. కరోనా లాక్ డౌన్ లేకపోయింటే ఈ పాటికి ఈమె జయగా నటించిన సినిమా కూడా విడుదల అయ్యేది.
ఇప్పటికే ఆ సినిమా షూటింగును పూర్తి చేసుకున్నట్టుగా ఉంది. ఈ క్రమంలో కంగనా కూడా రాజకీయ నేత అయిపోయినట్టుగా ఉంది. తాజాగా ఈమె మహారాష్ట్ర గవర్నర్ ను కలిశారు!
గవర్నర్ తో ఈమె జరిపే సమావేశాలు ఏముంటయబ్బా అనేది సామాన్యుడి డౌటు! సాధారణంగా ప్రభుత్వాలను వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీ వాళ్లు గవర్నర్ ను కలిసి తమ ఫిర్యాదులను దాఖలు చేస్తూ ఉంటారు. వాళ్ల మాటలు వినిపిస్తూ ఉంటారు గవర్నర్లు. తాము ప్రభుత్వం మీద గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్టుగా చెప్పుకుంటూ ప్రతిపక్షాల వాళ్లు మీడియా ముందు హడావుడి చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ ఫిర్యాదుల పట్ల గవర్నర్ లు ఏం చేస్తారనే అప్ డేట్ ఉండదు!
అలా గవర్నర్ కు వెళ్లడం గొప్ప అనేసుకున్నట్టుగా ఉంది కంగనా. అందుకే మహరాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీతో ఆమె సమావేశం అయ్యింది. రాజ్ భవన్ సమీపంలో కంగనా కార్లోంచి అచ్చం పొలిటీషియన్ లా పోజులిచ్చింది. మొత్తానికి ఈమెకు రాజకీయాలు బాగానే వంటబట్టినట్టుగా ఉన్నాయి! మరోవైపు రేపు మాపో డ్రగ్స్ కేసులో ఈమెను కూడా మహారాష్ట్ర పోలీసులు పిలుస్తారనే ప్రచారం సాగుతూ ఉంది.
2016లో ఈమె మాజీ ప్రియుడు ఒకరు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా కొకైన్ వాడుతుందని, తననూ వాడమని ఆమె సలహా ఇచ్చిందని చెప్పాడట. అందుకు సంబంధించి ఈమెను పోలీసులు విచారణకు పిలవొచ్చని సమాచారం. రియా చక్రబర్తి తదితరులంతా గంజాయి కేసుల్లోనే ఉన్నట్టున్నారు, కొకైన్ అంటే.. గంజాయి కన్నా చాలా తీవ్రమైనదే!