బంధం బలోపేతం దిశగా.. త్వరలో మోదీతో జగన్ భేటీ

కేంద్రంలోని బీజేపీతో వైసీపీ బంధం బలోపేతం కాబోతోందా? ఒకరి సహకారం మరొకరికి అనివార్యమైన పరిస్థితుల్లో రెండు పార్టీలూ కలిసి సాగబోతున్నాయా? కేంద్రంలోని ఎన్డీఏ సర్కారులో వైసీపీ చేరడానికి రంగం సిద్ధమవుతోందా? ప్రస్తుతం ఢిల్లీ రాజకీయవర్గాల్లో ఈ చర్చ జరుగుతోంది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వరుసగా రెండుసార్లు భేటీ అయిన ఏపీ సీఎం జగన్.. పలు కీలక అంశాలపై చర్చించారు. అప్పుడే కేంద్ర మంత్రివర్గంలో వైసీపీ చేరబోతోందనే వార్తలు వచ్చాయి.

తాజాగా వచ్చేవారం ప్రధాని మోదీతో జగన్ సమావేశం కాబోతుండటం సరికొత్త రాజకీయ పరిణామాలకు నాంది కాబోతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. షాతో భేటీ కోసం హస్తిన వెళ్లినప్పుడే ప్రధాని మోదీతోనూ జగన్ సమావేశం అవుతారని అందరూ భావించారు. కానీ అలాంటిది ఏమీ లేకుండానే జగన్ తిరుగు ప్రయాణమయ్యారు. తాజాగా వచ్చేవారం జగన్ కు ప్రధాని అపాయింట్ మెంట్ ఖరారైనట్టు సమాచారం. షాతో భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలపై మరింత స్పష్టత కోసమే మోదీని జగన్ కలవనున్నారని తెలుస్తోంది.

కేంద్రంలో ఎన్డీఏ వచ్చిన తర్వాత ప్రభుత్వంలో చేరకపోయినా.. వారికి అనుకూలంగానే వైసీపీ వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే ప్రత్యేక హోదాను సైతం పక్కన పెట్టేయాల్సి వచ్చింది. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా కోసం గళమెత్తుతానంటూ ఎన్నికల సందర్భంగా స్పష్టంచేసిన జగన్.. తర్వాత ఆ విషయంలో వెనకడుగు వేయక తప్పలేదు. బీజేపీకి తిరుగులేని మెజార్టీ రావడంతో ప్రత్యేక హోదా అటకెక్కింది. ఒకవేళ గట్టిగా నిలదీయాలన్నా.. జగన్ పై కేసుల కత్తి వేలాడుతోంది. దీంతో బీజేపీ అడుగులకు మడుగులొత్తడం మినహా మరేం చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే బీజేపీకి పార్లమెంటులో మద్దతుగా నిలుస్తోంది.

ఇటీవల ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులను తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. వైసీపీ మాత్రం మద్దతు ప్రకటించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వంలో చేరాలంటూ బీజేపీ అధిష్టానం ఇప్పటికే వైసీపీని ఆహ్వానించింది. అయితే, మైనార్టీ ఓటుబ్యాంకు, ఇతరత్రా రాజకీయ ఈక్వేషన్లలో భాగంగా ఆ దిశగా వైసీపీ ఇంతకాలం ముందడుగు వేయలేదు. ఈ నేపథ్యంలో అమిత్ షాతో భేటీ తర్వాత దాదాపుగా ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. మోదీతో సమావేశం తర్వాత ఆయన నుంచి వచ్చే హామీలను బట్టి కేంద్రంలో చేరే విషయంపై జగన్ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.

ఇప్పటికే ఏపీలో పరిస్థితులు గందరగోళంగా కనిపిస్తున్నాయి. న్యాయవ్యవస్థతో వైసీపీ సర్కారుకు అస్సలు పడటంలేదు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉండగా మరోవైపు ఆలయాలపై దాడులు ఇతరత్రా అంశాలు కూడా జగన్ కు తలనొప్పిగా పరిణమించాయి. అదే సమయంలో ప్రధాని మోదీపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ తరుణంలో మోదీతో జగన్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ బీజేపీ-వైసీపీ బంధం బలోపేతమైతే టీడీపీ పరిస్థితి ఏమిటనేది కూడా చర్చ జరుగుతోంది. వచ్చేవారం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు సంభవిస్తాయా లేక మోదీతో సమావేశం మామూలుగానే ముగుస్తుందా అన్నది తెలియాలంటే వేచి చూడక తప్పదు.