రాష్ట్ర రహదార్లపై ‘జగనన్న టోలు వాత’ అతి త్వరలో.!

సంక్షేమ పథకాల కోసమే పెద్దయెత్తున నిధులు ఖర్చు చేయాల్సి వస్తోంటే, ఖజానా నింపుకోవడానికి అడ్డదారులు తొక్కుతోందన్న విమర్శలు వివిధ రాజకీయ పార్టీల నుంచి వస్తున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే, ఆదాయం పెంచుకోడానికి ఏ ప్రభుత్వమైనా కొత్త మార్గాలు వెతకాల్సిందే. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర రహదారులపై టోలు గేట్లు ఏర్పాటు చేయాలనుకుంటోందంటూ ఓ వార్త బయటకు వచ్చింది. ప్రతిపాదనలు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చాయట. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సూచన ప్రాయంగా ఆ ప్రతిపాదనలకు ఆమోదం కూడా తెలిపేశారట.

తొలుత కొన్ని ప్రధాన రాష్ట్ర రహదారులపై టోల్‌ గేట్లు పెట్టి, తద్వారా వచ్చే ఆదాయం, విమర్శలకు అనుగుణంగా తదుపరి కార్యాచరణ అమలు చేయాలన్న దిశగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోందట. ఇదెక్కడి విడ్డూరం.? జాతీయ రహదారులపై టోల్‌ గేట్లు చూశాం. ఇప్పుడు రాష్ట్ర రహదార్లపై కూడా టోల్‌ గేట్లు వచ్చేస్తే.. ముందు ముందు గల్లీ రోడ్లపైనా టోల్‌ గేట్లను చూడాల్సి వస్తుంది. ‘పెంచుకుంటూ పోతాం..’ అని గతంలో సామాజిక పెన్షన్ల గురించి నినదించిన వైఎస్‌ జగన్‌, అధికారంలోకి వచ్చాక.. ఇదిగో, ఇలా జనం నెత్తిన ‘భారం’ పెంచుకుంటూ పోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోధరలు చాలా ఎక్కువ పొరుగు రాష్ట్రాలతో పోల్చితే.

‘ఆంధ్రప్రదేశ్‌లోకి వెళుతున్నారా.. ఇక్కడే పెట్రోలు, డీజిల్‌ ధర తక్కువ. ఇక్కడే మీ ట్యాంకు నింపుకోండి..’ అంటూ ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో ఇతర రాష్ట్రాల పరిధిలోని పెట్రోల్‌ బంకులు బోర్డులు పెడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏమన్నా అంటే, ‘రోడ్ల నిర్వహణ కోసం’ అంటూ ఇప్పటికే పలు మార్గాల్లో ‘బాదుడు’ షురూ అయ్యింది. అది చాలక, ఇప్పుడు రాష్ట్ర రహదార్లపై టోల్‌ గేట్స్‌ పెట్టేసి.. వసూళ్ళకు దిగితే, సామాన్యుడి బతుకు బస్టాండైపోదూ.! టోల్‌ గేట్‌ ద్వారా వెళ్ళే వాహనాలు.. అవి ప్రజా రవాణా వాహనాలైనా, సరుకు రవాణా వాహనాలైనా, ప్రైవేటు వాహనాలైనా ఒకటే బాదుడు. సో, ‘వాత’ గట్టిగానే పడబోతోందన్నమాట. చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత.. అని పెద్దలు ఊరకనే అనలేదు మరి.!