కేటీఆర్‌ సారూ.. విశ్వనగరం కాదు, విశ్వ‘నరకం’.!

రికార్డు స్థాయిలో వర్షం కురిసిందన్న విషయాన్ని పక్కన పెడితే, భాగ్యనగరంపై రాజకీయ నిర్లక్ష్యం.. తాజా భారీ వర్షాలతో నిరూపితమయ్యింది. ‘హైదరాబాద్‌ని అభివృద్ధి చేసింది మేమే..’ అంటాడొకాయన.. ‘హైద్రాబాద్‌ అభివృద్ధి మా నాన్న హయాంలోనే జరిగింది..’ అంటాడింకొకాయన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, గడచిన ఆరేళ్ళలో హైద్రాబాద్‌ని గొప్పనగరంగా ప్రపంచ పటంలో పెట్టామంటాడు మరొకాయన. ఏదీ ఎక్కడ.? హైద్రాబాద్‌ విషయంలో మంత్రి కేటీఆర్‌ ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారంటూ ‘గులాబీ’ శ్రేణులు ఉప్పొంగిపోతుంటాయి.

‘కరోనా సీజన్‌’లో అత్యంత వేగంగా అభివృద్ధి చేసేశాం.. అంటూ ఫ్లై ఓవర్లు ప్రారంభించేసింది అధికార పార్టీ. కానీ, భారీ వర్షానికి భాగ్యనగరం అతలాకుతలమైంది. ఇది విశ్వనగరం కాదు, విశ్వ‘నరకం’ అని నిరూపితమయిపోయింది. ఇదా అభివృద్ధి.? అని అంతా ముక్కున వేలేసుకుంటోన్న పరిస్థితి. ఇప్పుడు దేశమంతా హైద్రాబాద్‌ వర్షాల గురించి చర్చించుకుంటోంది. చెన్నయ్‌, ముంబై.. వాటికి ఏమాత్రం తీసిపోదు హైద్రాబాద్‌.. ‘వర్షాలు – ముంపు’ విషయంలో. అడ్డగోలుగా ఆక్రమణలకు పాల్పడిన సామాన్యుల పాత్రని ఎత్తి చూపుతూ అధికారంలో వున్నోళ్ళు అడ్డగోలు రాజకీయాలు చేస్తే సరిపోదిక్కడ.

అధికార యంత్రాంగం ఏం చేస్తోంది ఆక్రమణలు జరుగుతోంటే.! చెరువుల్ని పార్కులుగా ‘అభివృద్ది’ చేసేస్తే, ఆ చెరువుల్లోకి వెళ్ళాల్సిన నీరు, జనం మీదకు వచ్చి పడుతుందన్న ఇంగితం లేని ‘డెవలప్‌మెంట్‌’ ప్లాన్స్‌, వాటిని ఆమోదించిన అధికారులు, వాటికి అత్యంత ఆర్భాటంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్న రాజకీయ నాయకులు.. వీళ్ళదే అసలు నేరం. జనం కొట్టుకుపోవడమే కాదు, బైక్‌లు, కార్లు కూడా కొట్టుకుపోయాయి. హైద్రాబాద్‌లో చాలా రోడ్లు నదీ ప్రవాహాల్ని తలపించేశాయి. ఇదీ హైద్రాబాద్‌ విశ్వనరకం ఘనత.

విశ్వనగరం సంగతి దేవుడెరుగు.. ఓ సాధారణ నగరంగా, సమస్యలు లేని నగరంగా హైద్రాబాద్‌ని సమీప భవిష్యత్తులో ఊహించుకోగలమా.? ‘ఇదంతా గత పాలకుల పాపం..’ అంటూ ‘సమైక్య పాలకుల’ మీద నెపాన్ని నెట్టేసే బాధ్యతారాహిత్యాన్ని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడు వీడుతుందో అప్పుడే హైద్రాబాద్‌కి విశ్వనగరంగా భవిష్యత్తు వుంటుంది.