అమరావతి ప్రాంత రైతులపై పోలీసులు ఆంక్షలు, రైతుల హోరుతో చలో గుంటూరు దద్దరిల్లిపోయింది. విజయవాడ నుంచి రాజధాని గ్రామాలపై పోలీసు నిఘా ఉంచారు. ప్రకాశం బ్యారేజీ, కనకదుర్గమ్మ వారధి వద్ద వాహనాల తనిఖీలు చెపట్టారు. కార్లు, ఆర్టీసీ బస్సుల్లోని వారిని ఆరా తీశారు. పోలీసుల ఆంక్షలను రైతులు పట్టించుకోలేదు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో రైతులు ఉద్యమించారు. ఉదయం 10.30కి మహిళా జేఏసీ కన్వీనర్ రాయపాటి శైలజ తదితరులు జైల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. శైలజ తీవ్రంగా ప్రతిఘటించారు. మహిళా పోలీసులు ఆమెను బలవంతంగా వాహనంలోకి ఎక్కించే ప్రయత్నం చేసినా ప్రతిఘటించారు. గాయాలై, దుస్తులు చిరిగినా.. మొత్తానికి ఆమెను అరండల్‌పేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో మందడం గ్రామానికి చెందిన దుర్గాభవాని భర్త, 12 ఏళ్ల కుమార్తె పావనితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుర్గాభవానిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో బాలిక తల్లి కావాలంటూ ఏడుస్తూ ఉండటం పలువురిని కలచివేసింది.
పోలీసుల తీరు ముందే కనిపెట్టి..
పోలీసుల ఆంక్షలు విధించడంతో తాము అనుకున్న కార్యక్రమానికి శుక్రవారమే సన్నద్ధమయ్యారు రైతులు. ఆటోలు, కార్లు, బైక్, బస్సుల్లో గుంటూరు పరిసర గ్రామాలకు చేరుకున్నారు. కొందరు శనివారం ఉదయం వచ్చారు. వీరంతా పోలీసులకు అనుమానం రాకుండా జిల్లా జైలు చేరుకున్నారు. తాము నిర్ణయించిన 11:30 సమయం వరకు సాధారణ పౌరుల్లా వ్యవహరించారు. తమను అనుమానించి ప్రశ్నించిన పోలీసులకు షాపింగ్, అమరావతికి అని, బంధువుల ఇంటికి వచ్చామని చెప్తూ.. జైలు ప్రాంతంలోనే గడిపారు.
11.20 కాగానే అరండల్‌పేట, బ్రాడీపేట నుంచి ఒక్కసారిగా జైలు పరిసరాల్లోకి దూసుకొచ్చారు. అప్రమత్తమైన పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేసి అడ్డుకున్నారు. రైతులు, మహిళలు అరగంటకు పైగా రహదారిపై బైఠాయించారు. దీంతో 1.30 వరకు ట్రాఫిక్ స్తంభించింది. మహిళా పోలీసులు అడ్డుకోవడంతో మహిళా రైతులంతా కలసికట్టుగా ఉండిపోయారు. రైతులకు పోలీసులకు మధ్య వాదులాటతో ఘర్షణ వాతావరణం నెలకొంది. రైతు ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్, దళిత రైతు జేఏసీ కన్వీనర్ మార్టిన్ లూథర్, పీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, ప్రొఫెసర్ శ్రీనివాస్, సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.
ప్రజాస్వామ్య విలువలను మంటగలిపారు: చంద్రబాబు
రాజధాని అమరావతి ప్రాంతం సహా రాష్ట్రవ్యాప్తంగా 171 మంది టీడీపీ నాయకులను గృహనిర్బంధం చేసినట్లు ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. కృష్ణా.. 42, తూర్పు గోదావరి.. 39, పశ్చిమ గోదావరి.. 34, విజయనగరం.. 15, నెల్లూరు.. 15, కడప.. 13, గుంటూరు.. 7, ప్రకాశం.. 3, విశాఖ.. 1, చిత్తూరు.. 1, అనంతపురం.. 1 చొప్పున నేతలను హౌస్ అరెస్టులు చేశారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ‘రైతులకు సంకెళ్లు వేసి ప్రభుత్వం తప్పు చేస్తే.. శాంతియుత నిరసనలను అడ్డుకుని పోలీసులు తప్పు చేశారు. ప్రాథమిక హక్కులను కాలరాసి, ప్రజాస్వామ్య విలువలను మంటగలిపారు. టీడీపీ నేతల గృహ నిర్బంధంను ఖండిస్తున్నా. గుంటూరులో మహిళలు, ఐకాస నాయకులపై పోలీసుల తీరు దుర్మార్గంగా ఉంది. ప్రజలంతా ముక్తకంఠంతో ప్రభుత్వ తీరును ఖండించాలి’ అని పిలుపునిచ్చారు.