సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. కరోనా లాక్ డౌన్ వేళ అతడు చేసిన సేవానిరతిపై ఇప్పటికీ దేశంలో అందరూ గొప్పగా చెప్పుకుంటారు. ఎక్కడ సమస్య ఉందో.. అక్కడ క్షణాల్లో వాలిపోతాడు సోనూసూద్. సోనూసూద్ వృత్తి పరంగా నటుడు. ప్రవృత్తి పరంగా సమాజ సేవకుడు అన్న పేరు తెచ్చుకున్నారు..సోనూసూద్ చేసిన.. చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నానంటూ భరోసానిస్తున్నాడు. సోనూసూద్ ఇప్పుడు సాయానికి మారుపేరులా మారిపోయాడు.
ఎవరికి ఆపద వచ్చిన వెంటనే స్పందిస్తూ వారికి సాయం అందిస్తున్నాడు. వలస కార్మికులను వారి ఇంటికి పంపించి మానవత్వాన్ని చాటుకున్నాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక రైతుకు ట్రాక్టర్ కొనిచ్చాడు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో సాయాలు చేస్తున్నాడు. ఇటీవల ఓ విలేజీలో ఏకంగా సెల్ టవర్ వేయించాడు. తాజాగా ఓ హైదరాబాదీ బాలిక గుండెకు భరోసానిచ్చాడు.
గుండె జబ్బుతో బాధపడుతున్న బాలికకు సర్జరీ చేయిస్తానని సోనూసూద్ తాజాగా హామీ ఇచ్చాడు. హైదరాబాద్ హఫీజ్ పేటకు చెందిన తేజశ్రీ(12)కి గుండె సంబంధిత వ్యాధి ఉంది. ఇప్పటికే రూ.12 లక్షలు అప్పు చేసి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. అప్పులపాలైన తల్లిదండ్రులు చివరకు సోనూసూద్ శరణు వేడారు.
బాలిక తల్లిదండ్రులు ఈరోజు మొయినాబాద్ లో షూటింగ్ కోసం వచ్చిన సోనూను కలిసి సమస్య వివరించారు. దీనికి స్పందించిన సోనూ సూద్ బాలిక వైద్య ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చాడు. ఆ కుటుంబానికి ఆనందాన్ని పంచాడు.