మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ను పవన్ చేయబోతున్నాడు. ఆ విషయంలో అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. ఇప్పటి వరకు సినిమా షూటింగ్ ఎప్పుడు అనే విషయమై క్లారిటీ రాలేదు కాని కథ మరియు మరో హీరో.. పవన్ పాత్ర ఇలా ఎన్నో రకాల పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ రీమేక్ కోసం త్రివిక్రమ్ ఏకంగా పది కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అదేంటి దర్శకుడు సాగర్ చంద్ర కదా ఈయనకు అంత పారితోషికం ఎందుకు అనుకుంటున్నారా.. అసలు విషయం ఏంటీ అంటే ఈ రీమేక్ రచనతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ డైలాగ్ ఇలా అన్ని కూడా త్రివిక్రమ్ చూసుకుంటున్నాడట. అందుకే ఈ రీమేక్ కోసం ఆయనకు అంతగా పారితోషికంను ఇస్తున్నారని అంటున్నారు.
అల వైకుంఠపురంలో సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమాను చేయాలని త్రివిక్రమ్ భావించాడు. కాని కరోనా వల్ల వచ్చే ఏడాది వరకు ఎన్టీఆర్ డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. కనుక ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ తో ఈ రీమేక్ బాధ్యతలను నెత్తిన వేసుకున్నాడట. అధికారికంగా త్రివిక్రమ్ దర్శకత్వం కాకున్నా పూర్తి బాధ్యతలు ఆయనే చూసుకుంటాడు అంటూ వార్తలు వస్తున్నాయి. సినిమాకు సమర్పకుడిగా కూడా త్రివిక్రమ్ వ్యవహరించబోతున్నాడు. పది కోట్ల పారితోషికంతో పాటు లాభాల్లో వాటాను త్రివిక్రమ్ అందుకోబోతున్నాడు. త్రివిక్రమ్ కు హారిక హాసిని హోం బ్యానర్ వంటిది. వారికే సంబంధించినది సితార ఎంటర్ టైన్ మెంట్స్ అవ్వడం వల్లే త్రివిక్రమ్ కు ఈ స్థాయి ప్రాముఖ్య అంటున్నారు.