ఓడినా ధైర్యంగా నిలబడ్డాం: నిజాయితీతోనే సాధించామిది.!

‘‘2019 ఎన్నికల్లో ఓడినా, ధైర్యంగా నిలబడగలిగామంటే, అది నిజాయితీ కారణంగానే జరిగింది. ఓటర్లను ప్రలోభ పెట్టాలనే ఆలోచన లేని రాజకీయం.. రాజకీయమంటే ప్రజా సేవ అని నమ్మి వచ్చిన యువత.. ఇవీ జనసేన పార్టీ విజయాలు.. క్రియాశీల సభ్యత్వాలు, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి నిదర్శనాలు. ఒకే ఒక్క ఎమ్మెల్యే, పార్టీకి దూరంగా వున్నా.. ఆ నియోజకవర్గంలోనూ పెద్దయెత్తున క్రియాశీల సభ్యత్వం సాధించగలిగాం.. ఖచ్చితంగా 2024 ఎన్నికల నాటికి బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతాం..’’ అంటూ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు.

కరోనా నేపథ్యంలో కొద్ది నెలలపాటు ప్రత్యక్ష సమావేశాలకు దూరంగా వున్న జనసేనాని, మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ‘ఒక నాయకుడి కింద పనిచేయాలన్నది జనసేన పార్టీ సిద్ధాంతం కాదు. వ్యవస్థలో మార్పు కోసం అందరం కలిసి సమిష్టిగా పోరాడాల్సిన సందర్భమిది..’ అని జనసేన అధినేత అభిప్రాయపడ్డారు.

కరోనా నేపథ్యంలో ఒకేసారి అన్ని జిల్లాల్లోనూ ఉధృతంగా ‘క్రియా శీల సభ్యత్వ నమోదు కార్యక్రమం’ చేపట్టలేకపోయామన్న జనసేన పార్టీ ముఖ్య నేతలు, ముందు ముందు ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని పవన్‌ కళ్యాణ్‌కి తెలిపారు. మరోపక్క, జనసేన రాకతో మంగళగిరి జనసేన కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. కరోనా నేపథ్యంలో పార్టీ శ్రేణులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా, అంచనాలకు మించి జనసేన కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

ఇదిలా వుంటే, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, అమరావతి రైతులతో భేటీ కానున్న విషయం విదితమే. ఇప్పటికే అమరావతికి మద్దతుగా జనసేన పార్టీ నినదించింది.. ఏకైక రాజధాని అమరావతి.. అంటూ హైకోర్టులో అఫిడవిట్‌ కూడా దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో అమరావతి రైతులతో జనసేనాని సమావేశం కానుండడం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.