గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఫైట్‌: జనసేనాని ధైర్యమేంటి.?

తెలంగాణలోని జనసైనికులకు తీపి కబురు అందించారు జనసేనాని. గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు జనసేనాని ప్రకటించడంతో, జనసైనికుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. అయితే, బీజేపీ – జనసేన వేర్వేరుగా ప్రచారం చేయబోతున్నాయంటూ మీడియాలో కథనాలు వచ్చేసరికి అటు బీజేపీ శ్రేణులు, ఇటు జనసేన శ్రేణులు ఉలిక్కిపడ్డాయి.

‘ప్రస్తుతానికైతే పొత్తు చర్చలు ఎవరితోనూ జరగలేదు. అందరం కలిసి కూర్చుని, నిర్ణయం తీసుకుంటాం..’ అంటూ జనసేన పార్టీతో పొత్తు విషయమై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. బండి సంజయ్‌, పవన్‌ కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడు. మరోపక్క, బీజేపీ – జనసేన మధ్య పొత్తు నడుస్తోంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే పరిమితమని ఎలా అనుకోగలం.?

దుబ్బాక ఉప ఎన్నిక విషయమై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎలాంటి ప్రకటనా చేయకపోయినా, గ్రౌండ్‌ లెవల్‌లో జనసేన శ్రేణులు బీజేపీకి సహకరించిన మాట వాస్తవం. ఇక, గ్రేటర్‌ ఎన్నికల విషయానికొస్తే, ఇక్కడి ఈక్వేషన్స్‌ బీజేపీకి వర్కవుట్‌ అవ్వాలంటే జనసేనతో పొత్తు తప్పనిసరి. జనసేన కూడా, బీజేపీతో పొత్తు ద్వారా కొంత లాభపడే అవకాశం వుంది.

కాగా, విడివిడిగా ఎన్ని పార్టీలు పోటీ చేస్తే, తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కి అంత మేలు జరుగుతుంది. మరోపక్క, గ్రేటర్‌ ఎన్నికల్లో చిత్ర విచిత్రమైన పొలిటికల్‌ ఈక్వేషన్స్‌ కన్పిస్తుంటాయి. గ్రౌండ్‌ లెవల్‌లో అభ్యర్థులు పార్టీలకతీతంగా వ్యవహారాలు నడిపిస్తుంటారు. పైకి రాజకీయ ప్రత్యర్థుల్లా కనిపించినా, తెరవెనుక లాలూచీలు నడుస్తాయి. సో, ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది.? ఎవరితో పోరాడుతుంది.? అన్నదానిపై కొన్ని చోట్ల ఓటర్లకు సైతం అర్థం కాని పరిస్థితి వుంటుంది.

ఇంత గందరగోళం నడుమ, జనసేన పార్టీ.. గ్రేటర్‌ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించగానే.. ఇతర రాజకీయ పార్టీల్లోనూ కొంత అలజడి షురూ అయ్యింది. గ్రేటర్‌ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా పార్టీ శ్రేణుల నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో జనసేనాని ‘సై’ అనేశారు. ఇక గ్రౌండ్‌ లెవల్‌లో జనసైనికులు ఎలా పనిచేస్తారు.? అన్నది ప్రస్తుతానికి ఆసక్తికరమైన అంశం.

ఈ అనుభవం, ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల సమయంలో జనసేనకు బాగా కలిసొచ్చే అవకాశం వుంటుంది. కాగా, బీజేపీ అండతో కొన్ని సీట్లను గెల్చుకోవడంతోపాటు, కొన్ని సీట్లలో బీజేపీని గెలిపించగల సత్తా కూడా జనసేనకు వుందని గ్రేటర్‌ జనసేన నేతలు చెబుతున్నారు.