పావలా ఇచ్చి పది రూపాయల పబ్లిసిటీ పొందడమెలాగో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి తెలిసినంతగా ఇంకే ప్రభుత్వానికీ తెలియదేమో.! అధికారంలోకి వస్తూనే, సంక్షేమ పథకాల అమలుపై దృష్టిపెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ సర్కార్, ఎడా పెడా సరికొత్త సంక్షేమ పథకాల్ని ప్రకటించేస్తూ.. అమలు కూడా చేసేస్తోన్న విషయం విదితమే. తద్వారా లబ్దిదారులకు బాగానే గిట్టుబాటవుతోంది. మరి, అలా చేసిన ఖర్చు.. తిరిగి ఖజానాకి ఎలా చేరుతుందట.? ఏ ప్రభుత్వమైనా, జనం జేబుల్లోంచి లాక్కునే, ఖజానా నింపుకోవాలి.. తిరిగి దాన్నే సంక్షేమం కోసం ఖర్చు చేయాలి.
మామూలుగా అయితే, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆదాయాలు పెరుగుతాయి. తద్వారా వచ్చే డబ్బుల్ని సంక్షేమం కోసం చేయడం అనేది పద్ధతి. కానీ, ఆ పద్ధతికి ఎప్పుడో పాలకులు తిలోదకాలిచ్చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే వైఎస్ జగన్ సర్కార్, ప్రపంచానికే పాఠాలు చెప్పేలా ‘ఇచ్చుడు, లాగుడు’ కార్యక్రమం చేపడుతోంది. తాజా ‘ఇచ్చుడు’ కార్యక్రమం పేరు జగనన్న తోడు. మరి, ఆ వెంటనే ‘లాగుడు’ కూడా వుండాలి కదా.!
అందుకే, అంతకన్నా ముందే ఆస్తి పన్ను బాదుడుకి తెరలేపింది. ఆటోవాలాల కోసం ఆ మధ్య ఓ సంక్షేమ పథకం ప్రకటించింది వైఎస్ జగన్ సర్కార్. ఆ వెంటనే రాష్ట్రంలో పెట్రోధరలు పెరిగాయి. చెప్పుకుంటూ పోతే, ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలన్నా, దానికన్నా ముందే బాదుడు పథకానికి శ్రీకారం చుట్టేస్తోంది. ఇలా ఇచ్చి, అలా తీసుకోవడం కాదు.! ముందుగా తీసుకునే కార్యక్రమానికి స్కెచ్చేసి, ఆ తర్వాత ఇచ్చుడు కార్యక్రమానికి పబ్లిసిటీ చేసుకుంటారన్నమాట.
జగనన్న తోడు కోసం పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చుకున్న వైఎస్ జగన్ సర్కార్, అదే చేత్తో.. ఈ ‘బాదుడు’ వ్యవహారాలకి కూడా ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తే బావుంటుందేమో.! ప్రభుత్వం నుంచి తమకు సంక్షేమ పథకాలు అందుతున్నాయనే సంబరాల్లో మునిగి తేలుతున్న జనం, అదే ప్రభుత్వం తమ నెత్తిన మోపుతున్న ‘అప్పుల బండ’ గురించి కూడా తెలుసుకుంటే మంచిది. రికార్డు స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందంటే, ఆ మాత్రం బాదుడు తప్పదు మరి.