బండి సంజయ్‌, అక్బరుద్దీన్‌లపై హేట్‌ స్పీచ్‌ కేసులు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మరియు ఎంఐఎం పార్టీల మద్య మాటల యుద్దం నడుస్తోంది. ఒక వైపు బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్‌ పార్టీని విమర్శిస్తూనే మరో వైపు ఎంఐఎం పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ సమయంలోనే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ మాట్లాడుతూ దమ్ముంటే మీకు హుస్సేన్‌ సాగర్‌ ఆక్రమించి నిర్మించిన ఎన్టీఆర్‌ మరియు పీవీ ఘాట్‌లను తొలగించాలని సవాల్‌ విసిరాడు. ఆ సవాల్‌కు చాలా సీరియస్‌గా స్పందించిన బీజేపీ చీప్‌ బండి సంజయ్‌ మీరు ఆ పని చేస్తే నిమిషాల్లోనే దారుస్సలాంను కూల్చడానికి సిద్దంగా ఉన్నామన్నారు.

ప్రజలను రెచ్చగొట్టే విధంగా వీరిద్దరి మాటలు ఉన్నాయి అంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు కూడా ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టేలా మాట్లాడటం తో కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సార్‌నగర్‌ పోలీసులు పేర్కొన్నారు. ఇద్దరి నుండి వివరణ అడుగబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. వీరిద్దరి పై కేసు నమోదు చేయడంతో ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. తమ పార్టీ నాయకులపై టీఆర్‌ఎస్ కావాలని కేసులు పెట్టించిందని ఆరోపిస్తున్నారు.