కేసీఆర్‌కి షాకిచ్చిన మోడీ.. ‘గ్రేటర్‌’ రాజకీయమేనా.?

ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వ్యాక్సిన్‌కి సంబంధించి ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించేందుకోసం హైద్రాబాద్‌ వస్తున్నారు. మరో రెండు నగరాల్లోనూ కోవిడ్‌ వ్యాక్సిన్‌పై ఆయన సమీక్షించనున్నారు. గ్రేటర్‌ ఎన్నికల వేళ, ఆకస్మికంగా ఈ పర్యటన ఖరారు కావడమే అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. అయితే, ప్రధాని మోడీ పర్యటనలో, గ్రేటర్‌ ఎన్నికల అంశం ప్రస్తావనకు వస్తుందా.? రాదా.? అన్నదానిపై ఇప్పటిదాకా స్పష్టత లేదు. మరోపక్క, ప్రధాని.. రాష్ట్రానికి ఓ అధికారిక కార్యక్రమం కోసం వస్తున్నప్పుడు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్‌ సహా.. పలువురు మంత్రులు, అధికారులు ప్రత్యేకంగా ఆహ్వానం పలకడం చూస్తుంటాం.

కానీ, ప్రధాని మోడీ హైద్రాబాద్‌ పర్యటన కోసం కేవలం ఐదుగురు అధికారులకే అవకాశం కల్పించారట. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రెటరీకి సమాచారం ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది. ‘ఇంతకు ముందెన్నడూ ఇలాంటి వైపరీత్యం చూడలేదు..’ అని ఐఏఎస్‌ అధికారులూ, ఐపీఎస్‌ అధికారులూ అనుకుంటున్నారట. ఈ మేరకు తెలంగాణలోని అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ అనుకూల మీడియా కుప్పలు తెప్పలుగా కథనాల్ని ప్రసారం చేస్తోంది. ఇందులో కొంత నిజం కూడా లేకపోలేదు. కానీ, గ్రేటర్‌ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోడీ ఇంతటి వివాదాస్పద నిర్ణయం ఎందుకు తీసుకుంటారు.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

కరోనా నేపథ్యంలో ‘ప్రోటోకాల్‌’ విషయమై ప్రధాని కార్యాలయం ఇలాంటి నిర్ణయం తీసుకుందా.? లేదంటే, భద్రతా కారణాల రీత్యా కేవలం ఐదుగురు అధికారులకే సమాచారమిచ్చారా.? వాతావరణ పరిస్థితులు, ఇతరత్రా అంశాల్ని ప్రధాని కార్యాలయ అధికారులు పరిగణనలోకి తీసుకున్నారా.? అన్న విషయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి రాజకీయ హడావిడీ లేకుండా ప్రధాని మోడీ, హైద్రాబాద్‌కి వచ్చి కోవిడ్‌ వ్యాక్సిన్‌ పరిస్థితిపై సమీక్షించి వెళ్ళిపోతే, దీన్ని ‘సింప్లిసిటీ’ వ్యవహారంగానే భావించాల్సి వస్తుంది. లేదూ, ఏదన్నా రాజకీయ ప్రకటన ఆయన చేశారంటే మాత్రం, ఖచ్చితంగా ఈ ‘సింప్లిసిటీ’ని రాజకీయ కోణంలోనే చూడాల్సి వస్తుంది.