థియేటర్లకు మళ్లీ జనాలను రప్పించేందుకు తేజూ వంతు ప్రయత్నం

కరోనా కారణంగా మూత పడ్డ థియేటర్లు మళ్లీ తెరుచుకున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను ఓపెన్‌ చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. పలు మల్టీప్లెక్స్‌ లతో పాటు ఎక్కువ శాతం సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్లు కూడా తెరుచుకున్నాయి. నేటి నుండి మరిన్ని థియేటర్లలో బొమ్మ పడుతోంది. ఇప్పటికే ప్రారంభం అయిన థియేటర్లు కూడా ఉన్నాయి. అయితే జనాలు మాత్రం చాలా తక్కువగా వస్తున్నారు. ఈసమయంలో సినీ ప్రముఖులు థియేటర్ల ఓపెన్‌ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వివిధ మార్గాల ద్వారా తెలియజేస్తూ జనాలు రావాలంటూ పిలుపునిస్తున్నారు.

మమ్ముల రమ్మంటున్నారు కాని మీరు థియేటర్‌ కు వెళ్లి సినిమా చూస్తారా అంటూ కొందరు స్టార్స్‌ ను ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ స్వయంగా ఐమాక్స్‌ కు వెళ్లి సినిమా చూశాడు. 8 నెలలుగా మనం మిస్‌ అయిన ఎంటర్‌ టైన్‌ మెంట్‌ మళ్ళీ ప్రారంభం అయ్యింది. కనుక ఏ ఒక్కరు కూడా దీనిని మిస్‌ చేసుకోవద్దంటూ ఆయన విజ్ఞప్తి చేశాడు. మొత్తానికి టాలీవుడ్‌ హీరోల్లో మొదటగా సాయి ధరమ్‌ తేజ్‌ ఇలా స్టెప్‌ తీసుకుని థియేటర్‌ కు తాను వెళ్లి జనాలను కూడా రావాల్సిందిగా సూచించడం అభినందనీయం అంటున్నారు.

ఇక ఈయన నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ సినిమాను త్వరలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సినిమా మాత్రమే కాకుండా మరి కొన్ని సినిమాలను కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సాయి ధరమ్‌ తేజ్‌ రెడీ అవుతున్నాడు. వచ్చే ఏడాదిలో మెగా ఫ్యామిలీకి చెందిన దాదాపు 20 సినిమాలు బిగ్‌ స్క్రీన్‌ ను హిట్‌ చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. ఆయన తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ కూడా ఉప్పెన సినిమాతో రెడీగా ఉన్నాడు.