విజయనగరం జిల్లాలో మాజీ ఎంపీ అశోక్ గజపతిరాజు ‘రాజకీయ కోట’ బద్దలవుతోంది.. అలా బద్దలుగొడుతున్నది కూడా తెలుగు తమ్ముళ్ళే కావడం గమనార్హం. ఒకప్పుడు టీడీపీలో బలమైన నాయకుడిగా అశోక్ గజపతిరాజు చక్రం తిప్పారు. కానీ, పరిస్థితులు మారాయి. 2014 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన అశోక్ గజపతిరాజు, కేంద్ర మంత్రి కూడా అయ్యారు. అయితే, జిల్లాలో పార్టీని ఆయన గాలికి వదిలేశారు.
అప్పట్లో మోడీ భజన ఎక్కువగా చేసి, ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవి పోయాక.. మోడీని విమర్శించడం మొదలు పెట్టారు. విజయనగరం జిల్లా రాజకీయాలు మారిపోయాయ్. టీడీపీ పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. నిజానికి, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి అండగా వుండాల్సిన అశోక్ గజపతిరాజు, పార్టీని లైట్ తీసుకున్నారు. ‘కోటలోని రాజకీయాలకు’ పరిమితమైపోయారాయన.
మన్సాస్ ట్రస్ట్ వివాదం సహా, కుటుంబ వ్యవహారాల్లో తలమునకలైపోయారు. సోదరుడి కుమార్తెతో రాజకీయ యుద్ధంలో బిజీ అయిపోయి, తెలుగు తమ్ముళ్ళకు దూరమైపోయారు. సరిగ్గా ఈ టైమ్‌లోనే విజయనగరం జిల్లా తెలుగు తమ్ముళ్ళు, సొంత కుంపటి పెట్టేసుకున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత నేతృత్వంలో కొత్త గ్రూపు ఏర్పాటయ్యింది. ఆమె సొంతంగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అంతే, విజయనగరం జిల్లాలో రెండు గ్రూపులు ఏర్పడినట్లయ్యింది.. ఓ గ్రూపులో అశోక్ గజపతిరాజు మాత్రమే వున్నారిప్పుడు.
ఆయన ఇప్పటిదాకా కోటనే టీడీపీ కార్యాలయంగా కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు వ్యవహారాలన్నీ మీసాల గీత కార్యాలయం వైపుకు వచ్చేశాయి. నిజానికి, ఇంత పెద్ద ప్రక్రియ.. పార్టీ అధినేత చంద్రబాబుకి సంబంధం లేకుండా జరిగిందని అనుకోలేం. అదే సమయంలో, టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడు నియమితులయ్యాక.. ఉత్తరాంధ్ర టీడీపీలో ఇది పెను ప్రకంపనగానే చెప్పుకోవాల్సి వుంటుంది.
మొత్తమ్మీద, టీడీపీ వ్యవహారం మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు తయారయ్యింది. ఒకవేళ చంద్రబాబు, అచ్చెన్నాయుడు సహాయ సహకారాలతోనే ఇదంతా జరుగుతోందన్నదే నిజమైతే.. అశోక్ ఎక్కువ కాలం టీడీపీలో వుండకపోవచ్చు.