ప్రభాస్ ఈసారైనా ఇచ్చిన మాటపై నిలబడతాడా?

రెబెల్ స్టార్ ప్రభాస్ ను ఇక ఏమాత్రం రీజినల్ హీరోగా పరిగణించలేం. అన్ని ఇండస్ట్రీల ఫిల్మ్ మేకర్స్ తో ఇప్పుడు ప్రభాస్ సినిమాలు చేస్తున్నాడు. టాలీవుడ్ దర్శక, నిర్మాతలతో రాధే శ్యామ్, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం చేస్తోన్న ప్రభాస్, శాండల్ వుడ్ దర్శకనిర్మాతలతో సాలార్ చేయనున్నాడు. అలాగే బాలీవుడ్ దర్సకనిర్మాతలతో ఆదిపురుష్ లో నటించనున్నాడు.

ఈ సినిమాలు అన్నీ ఐదు భాషల్లో విడుదల కానున్నాయి. ఈ సినిమాల లైనప్ తో ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. ఒక్కో సినిమాకు దాదాపు 80 కోట్ల పారితోషికంతో ప్రభాస్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడ్డాడు.

అయితే ప్రభాస్ బాహుబలి విడుదలయ్యాక అభిమానులకు ఒక మాట ఇచ్చాడు. ఇకపై ప్రతీ ఏడాది రెండు సినిమాల విడుదలలు ఉండేలా చూసుకుంటాను అన్నాడు. అయితే అది జరగలేదు. బాహుబలి తర్వాత సాహో విడుదలకు రెండేళ్లకు పైగానే పట్టింది. అలాగే ఇప్పుడు రాధే శ్యామ్ విడుదలకు కూడా రెండేళ్ల సమయం పడుతోంది.

ప్రభాస్ ప్రస్తుత సినిమాల లైనప్ తో ఈ తప్పు జరగకుండా జాగ్రత్తపడేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రతీ ఏడాదికి రెండు సినిమాలు కాదు కానీ, ప్రతీ 8-9 నెలలకు ఒక సినిమా విడుదలయ్యేలా ప్రభాస్ ప్రస్తుత ప్లానింగ్ ఉంది.

ఇప్పటికే రాధే శ్యామ్ షూటింగ్ దాదాపు పూర్తవ్వగా, ఈ చిత్రాన్ని 2021 సమ్మర్ లో విడుదల చేయనున్నారు. అలాగే సలార్, ఆదిపురుష్ సినిమాల షూటింగ్ లో జనవరిలో మొదలుకానున్నాయి. 2022 జనవరికి సలార్ విడుదలైతే, ఆగస్ట్ లో ఆదిపురుష్ విడుదలవుతుంది. ఇక 2023 సమ్మర్ కు నాగ్ అశ్విన్ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.