రామతీర్థంలో త్రిదండి చినజియర్ స్వామి పర్యటన

శ్రీరాముడి విగ్రహం ధ్వంసం జరిగిన రామతీర్ధం లో త్రిదండి చినజీయర్ స్వామి పర్యటించారు. కొండపైన ఉన్న కోదండ రామాలయాన్ని ఆయన సందర్శించారు. ఆయన పర్యటనను రాష్ట్ర దేవాదాయ శాఖ గోప్యంగా ఉంచింది. ధ్వంసమైన స్వామి విగ్రహం, శ్రీరాముడి తల దొరికిన కొలనును చినజియర్ పరిశీలించారు. విగ్రహ ధ్వంసం సంబంధిత విషయాలను అధికారులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా చినజియర్ మాట్లాడారు.

‘రామతీర్ధంలో పరిస్థితులు మార్చాలి. ఆలయానికి ఆగమ శాస్త్రం ప్రకారం సూచనలు చేశాం. ఈనెల 17 నుంచి రాష్ట్ర పర్యటన చేపట్టి ఆలయాల దర్శన యాత్ర చేస్తున్నాం. ఆలయాల్లోని లోపాలు, చేపట్టాల్సిన ప్రక్రియల గురించి పరిశీలించి సలహాలిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా మారుమూల ఉన్న ఆలయాలను ఏడాదిలోగా సదుపాయాలు, రక్షణ కల్పించాలి. రాష్ట్రంలోని ప్రతి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని దేవాదాయ శాఖకు సూచిస్తున్నాం. ప్రభుత్వ చర్యలతోపాటు భక్తుల్లో భక్తిభావం పెంపెందేలా ప్రభుత్వ చర్యలు ఉండాలి’ అని అన్నారు.