తప్పదు, వైసీపీ పెద్దల మైండ్ సెట్ మారాల్సిందే.!

రాజకీయ పరమైన వ్యవహారాలు వేరు, పాలనా పరమైన వ్యవహారాలు వేరు. ఒక్కోసారి తగ్గాల్సి వస్తుంది. ఎక్కడ నెగ్గాలో తెలుసుకోవడమే కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుకుంటేనే ముందడుగు వేయడం సులభతరమవుతుంది. లేదంటే, కష్టాలు కొనితెచ్చుకోక తప్పదు. ప్రతి అంశంలోనూ ఎదురుతిరిగే వైఖరి సరికాదు. ఒక్కోసారి కాస్త తగ్గడం ద్వారా మంచి ఫలితాల్ని సాధించే అవకాశం వుంటుంది.. ప్రజల మన్ననల్ని గెల్చుకోవడానికి వీలవుతుంది.

కానీ, రాష్ట్రంలో వైసీపీ పాలన చాలా భిన్నంగా కనిపిస్తోంది. వైసీపీ అధిష్టానం, మొండి వైఖరి.. వైసీపీ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు కష్టాల్ని తెచ్చిపెడుతోంది. నిజానికి, ప్రభుత్వానికి.. విపక్షాల నుంచి సమస్యలు రావడంలేదు.. ప్రభుత్వానికి అధికార పార్టీ పెద్దల వ్యవహార శైలే చెడ్డపేరు తెస్తోంది. మంత్రులు తాము బాద్యతాయుతమైన పదవుల్లో వున్నామన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ముఖ్యమంత్రి సైతం, ఒక్కోసారి పరిధి దాటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫలితంగా, మొట్టికాయలు ఎదుర్కోవాల్సి వస్తోంది.. న్యాయ వ్యవస్థ నుంచి.

న్యాయ వ్యవస్థపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం వైసీపీ నేతలకు ఫ్యాషన్‌గా మారిపోయింది. తద్వారా అధికారంలో వున్నవారికి వ్యవస్థ పట్ల విశ్వాసం లేదన్న సంకేతాలు జనంలోకి వెళ్ళిపోతున్నాయి. ‘సుప్రీం కోర్టు తీర్పుని గౌరవిస్తున్నాం..’ అని నిన్న ముఖ్యమంత్రి సహా అధికార పార్టీ పెద్దలు చేసిన వ్యాఖ్యల్ని స్వాగతించాల్సిందే. కానీ, ఈ ‘గౌరవిస్తున్నాం’ అనే మాట, ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసినప్పుడూ, ఇతరత్రా విషయాల్లోనూ కోర్టు తీర్పుల సందర్భంగా చెప్పి వుంటే ఇంతలా సమస్యలు వచ్చేవి కావు.

పాలనలో ‘సలహాల’ కోసం సలహాదారుల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం సర్వసాధారణమైన విషయమే. కానీ, ఎవర్ని సలహాదారులుగా నియమించుకున్నాం.? అన్నదానిపై ప్రభుత్వ పెద్దలు పునఃసమీక్షించుకోవాలి. ఫలానా నిర్ణయం, న్యాయ సమీక్షలో నిలబడదని చెప్పలేని సలహాదారులు వుంటే ఉపయోగమేంటి.? సొంత సామాజిక వర్గానికి చెందినవారిని ఎక్కువగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సలహాదారులుగా నియమించుకున్న దరిమిలా.. ఈ విమర్శ ఇంకాస్త గట్టిగా వినిపిస్తోంది.

సరే, అది రాజకీయ విమర్శ.. అన్నది వేరే చర్చ. కానీ, పాలన పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు బెడిసి కొడుతున్నాయంటే, ఆ నిర్ణయాలు జరిగేముందు సలహాదారులు.. ప్రభుత్వానికి ఎలాంటి సహాలిస్తున్నారన్నది క్రాస్ చెక్ చేసుకోకపోతే ఎలా.? విపక్షాలపై విరుచుకుపడటం, బూతులు తిట్టడం గొప్ప కాదు. ప్రభుత్వానికి చీవాట్లు పడకుండా చూసుకోవాలి. దురదృష్టవవాత్తూ వైసీపీ పెద్దల్లో ఆ ‘సోయ’ కన్పించడంలేదు. ఇప్పటికైనా, అధికార పార్టీ పెద్దల మైండ్ సెట్ మారుతుందా.? వేచి చూడాల్సిందే.