జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఒంటరిగానే రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. 2009 ఎన్నికలకు ముందు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు, అన్నయ్య చిరంజీవికి అండగా తమ్ముడు పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. మొత్తంగా మెగా కాంపౌండ్, ప్రజారాజ్యం పార్టీ కోసం పనిచేసింది. కానీ, జనసేన విషయంలో అలా జరగలేదు.
మెగాస్టార్ చిరంజీవి, జనసేన కోసం 2019 ఎన్నికల్లో ప్రచారం నిర్వహించలేదు. అయితే, బాబాయ్ పవన్ కళ్యాణ్‌కి మద్దతు ప్రకటించారు రామ్ చరణ్. అల్లు అర్జున్ కూడా జనసేనానికి మద్దతిచ్చారు. మరోపక్క, మెగా బ్రదర్ నాగబాబు అయితే, జనసేన నుంచి పోటీ చేశారు కూడా. చిరంజీవి మాత్రం, జనసేన విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ‘తమ్ముడికి నా సపోర్ట్ ఎప్పుడూ వుంటుంది.. హా ఇద్దరి ఆలోచనలు వేరు కావొచ్చు.. కానీ, అంతిమంగా మేం ప్రజలకు మేలు జరగాలనే చూస్తాం.. మా ప్రయాణాలు వేరైనా, గమ్యం ఒకటే..’ అని పలు సందర్భాల్లో చెప్పారు.
నిజమే.. చిరంజీవి భావజాలం వేరు, పవన్ కళ్యాణ్ ఆలోచనలు వేరు. అయినాగానీ, చిరంజీవినీ.. పవన్ కళ్యాణ్‌నీ వేరుగా చూడలేం. ఎందుకంటే, చిరంజీవిని పవన్ కళ్యాణ్.. కేవలం అన్నయ్యలానే కాదు, తండ్రి తర్వాత తండ్రి అంతటి ప్రత్యేక గౌరవభావంతో చూస్తారు గనుక.
ఇక, అసలు విషయానికొస్తే, తాజాగా జనసేన నేత నాదెండ్ల మనోహర్, చిరంజీవి విషయమై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో నటించడానికి కారణం చిరంజీవేనని చెప్పారు నాదెండ్ల. అంతే కాదు, పవన్ రాజకీయ ప్రయాణంలో తానూ తోడుంటానని అంతర్గత సమావేశంలో చిరంజీవి చెప్పినట్లు నాదెండ్ల వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక్కడ తోడుండటమంటే, ప్రత్యక్షంగా చిరంజీవి.. పవన్ కళ్యాణ్‌కి మద్దతివ్వడం.. జనసేన తరఫున ప్రచారం చేయడం అనుకుంటే తప్పులో కాలేసినట్లే.
చిరంజీవి ఆశీస్సులు పవన్ కళ్యాణ్‌కి ఎల్లప్పుడూ వుంటాయి. అయితే, నాదెండ్ల వ్యాఖ్యల నేపథ్యంలో మెగా కాంపౌండ్‌లో చీలిక తెచ్చేందుకు, అదే సమయంలో చిరంజీవిని రాజకీయ వివాదాల్లోకి లాగేందుకు కొన్ని మీడియా శక్తులు దుష్ప్రచారం షురూ చేసేయడం గమనార్హం.
Share