బర్త్‌డే స్పెషల్‌ః హాస్యబ్రహ్మ నీకు సాటి మరెవ్వరు లేరు, రారు.!

టాలీవుడ్ ప్రేక్షకులకు కామెడీ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేర్లలో బ్రహ్మానందం పేరు ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన గిన్నీస్‌ బుక్ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు దక్కించుకునే స్థాయిలో సినిమాలు చేశారు అంటే ఏ రేంజ్ లో ఆయన సినిమాలు చేశారో అర్థం చేసుకోవచ్చు. రికార్డు బ్రేకింగ్‌ సినిమాల్లో నటించిన ఆయన ఈమద్య కాలంలో కాస్త తక్కువగా కనిపిస్తున్నాడు. అయినా కూడా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఆయన చేసిన సినిమాల తాలూకు కామెడీ సన్నివేశాలు ఇప్పటికి సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. ఆయన్ను అభిమానులు ఇప్పటికి కమెడియన్‌ గా స్టార్‌ హోదా ఇచ్చి గౌరవిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఆయన ఎప్పటికప్పుడు ట్రెండ్‌ అవుతూనే ఉంటారు. అంతర్జాతీయ స్థాయి మీమ్‌ క్రియేటర్స్‌ కూడా బ్రహ్మానందం ఎక్స్‌ ప్రెషన్స్‌ తో మీమ్స్ చేస్తారు అంటూ ఇటీవలే నిరూపితం అయ్యింది. వందల కొద్ది పాత్రల్లో కనిపించిన బ్రహ్మానందం అద్బుతమైన నటనతో కామెడీ ఎక్స్ ప్రెషన్స్ తో వింత వింత యాంగిల్స్ తో కనిపించి మెప్పించాడు. అందుకే ఆయన బర్త్‌ డేను సోషల్ మీడియాలో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కామెడీలో సరిలేరు.. మీకు సాటి మరెవ్వరు లేరు హాస్యబ్రహ్మా అంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మళ్లీ ఆయన సినిమాల్లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. దర్శకులు ఆయన్ను కొత్తగా చూపించి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు.