తెలుగుదేశం పార్టీ నిండా మునిగిపోయింది.. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడంలో ప్రయోజనమే లేదు. కానీ, వున్నంతలో ఉనికిని చాటుకోవాలన్న ఆరాటం తెలుగుదేశం పార్టీ ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలోనే మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి టీడీపీ అధినాయకత్వం శ్రీకారం చుట్టింది.
టీడీపీ అధినేత చంద్రబాబు మునిసిపల్ ఎన్నికల ప్రచారం కోసం సన్నద్ధమయ్యారు. ఇంకోపక్క టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తున్నారు.. టీడీపీకి ఓటేసి గెలిపించాలంటూ హిందూపురం ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ‘గడచిన రెండేళ్ళలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి..’ అంటూ బాలకృష్ణ డిమాండ్ చేసేశారు.
నలుగురు మంత్రులు తీవ్రస్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారంటూ బాలయ్య ఆరోపించేశారు. అతి త్వరలో టీడీపీ తిరిగి అధికారంలోకి రాబోతోందని సెలవిచ్చారు హిందూపురం ఎమ్మెల్యే. వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందనీ బాలయ్య చెప్పుకొచ్చారు.
బాలయ్య ఇంతలా గొంతు చించుకుంటున్నా, టీడీపీకి చెందిన కింది స్థాయి నేతలు పార్టీ పట్ల నమ్మకంతో కనిపించడంలేదు. చాలామంది ఇప్పటికే గోడ దూకేశారు. మిగతా నేతలు, కార్యకర్తలు కూడా అదే బాటలో పరుగులు పెడుతున్నారు వైసీపీ సహా ఇతర పార్టీల్లోకి. బాలయ్య సొంత నియోజకవర్గంలోనూ టీడీపీ పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు.
పండక్కో పబ్బానికో కొత్తల్లుడు వచ్చినట్టు.. అప్పుడప్పుడూ సొంత నియోకవర్గంలో బాలయ్య ‘గెస్ట్ విజిట్స్’ చేస్తుంటారు.. నోటికొచ్చింది మాట్లాడేసి వెళుతుంటారు. రాష్ట్రంలో టీడీపీ దుస్థితిని గుర్తించి అయినా, తనవంతుగా పార్టీ కోసం బాలయ్య పనిచేసింది లేదు. అసలు అసెంబ్లీలో బాలయ్య గొంతు ప్రజల సమస్యలపై ఏనాడైనా లేచిందా.?
సినిమాల్లో డైలాగులు చెప్పమంటే బాలయ్య తర్వాతే ఎవరైనా. అదే రాజకీయాల్లో అయితే, బాలయ్య మరీ గెస్ట్ ఆర్టిస్ట్ అయిపోయారు.. పార్టీ పూర్తిగా భ్రష్టుపట్టిపోయాక, పార్టీ జెండా పట్టుకుని రాజకీయ ప్రత్యర్థులకు.. అందునా అదికార పార్టీకి బాలయ్య సవాల్ విసిరినా ఏం ప్రయోజనం.?