ఆంధ్రపదేశ్‌లో ‘ఫ్యాక్ట్ చెక్’ అత్యవసరమేగానీ.!

తప్పుడు ప్రచారం అనేది రాజకీయాల్లో సర్వసాధారణమైపోయింది. మీడియా ముందుకొస్తే రాజకీయ నాయకులు మాట్లాడేవన్నీ అబద్ధాలే. వాటికి ‘ఫ్యాక్ట్ చెక్’ అనేది వుండదు. నోటికొచ్చింది వాగడానికే మీడియా మైకులు.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవు.. అన్ని పార్టీలదీ అదే పరిస్థితి. అధికార వైసీపీ ఇందుకు మినహాయింపేమీ కాదు.

ఇక, తమ ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారానికి సంబంధించి జగన్ సర్కార్ పలు చర్యలు చేపడుతోంది. కేసులు పెడుతున్నారు.. అరెస్టులు చేస్తున్నారు.. చాలా చాలానే జరుగుతున్నాయి. ఈ క్రమంలో చిన్న చిన్న విషయాలకే కొందరి అరెస్టులు జరుగుతుండడంతో న్యాయస్థానాల్లో పోలీసు వ్యవస్థకు మొట్టికాయలు తప్పడంలేదనుకోండి.. అది వేరే సంగతి. ఇక, ఇప్పటికే పోలీసు వ్యవస్థ ‘ఫ్యాక్ట్ చెక్’ అంటూ ఆయా అంశాలపై ఎప్పటికప్పుడు వివరణలు ఇస్తూ వచ్చింది.

తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘ఏపీ ఫ్యాక్ట్ చెక్’ పేరుతో ఓ వెబ్ సైట్ అలాగే సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను ప్రారంభించారు. నిజానికి చాలా మంచి ఆలోచనే ఇది. అయితే, అధికారంలో వున్నవారు.. తమ పార్టీ తరఫున ఇతర పార్టీలపై దుష్పచారం చేయకూడదన్న ‘కనీస విజ్ఞతను’ పాటిస్తే, ‘ఫ్యాక్ట్ చెక్’ అన్న ఆలోచనకు అర్థం వుంటుంది. ‘మా ప్రభుత్వం విషయంలో మాత్రమే ఫ్యాక్ట్ చెక్ అమలు చేస్తాం.. ఇతర విషయాలతో మాకు సంబంధం లేదు..’ అని అధికారంలో వున్నవారు అనదలచుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు, పెరిగిపోతున్న బలవంతపు మత మార్పిడులు సహా.. అనేక అంశాలకు సంబంధించి అధికార పార్టీ, ప్రజలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున ‘ఫ్యాక్ట్ చెక్’ అనేది ఎంతవరకు నిఖార్సుగా పనిచేస్తుందన్నది ప్రస్తుతానికైతే మిలియన్ డాలర్ల ప్రశ్నే. కానీ, దుష్పచారాల్ని ఎవరైనా సరే ఖండించాల్సిందే. రూమర్స్ పుట్టించి ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనో, సమాజంలో అలజడి రేపాలనో ప్రయత్నించేవారిపై ఉక్కుపాదం మోపడం ప్రభుత్వ బాధ్యత.