‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో విశాఖ కేంద్రంగా ఉద్యమం జరుగుతోంది. ఈ ఉద్యమంలో కార్మిక సంఘాల చిత్తశుద్ధిని ప్రశ్నించలేం. అయితే, వివిధ రాజకీయ పార్టీలు.. విశాఖ వేదికగా చేసుకుని ‘తుక్కు’ రాజకీయాలు తెరపైకి తెస్తుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
వైసీపీ, టీడీపీ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకమంటున్నాయి. చిత్రమేంటంటే.. చంద్రబాబు అధికారంలో వున్నప్పుడు విశాఖ ఉక్కు అంశంపై ప్రతిపాదనలు నడిస్తే, అవి వైఎస్ జగన్ హయాంలో మరింత ముందడుగు వేశాయి. ‘పోస్కో’ ప్రతినిథులతో తాను భేటీ అయ్యింది వాస్తవమనీ, విశాఖ కాకుండా మరో చోట స్టీల్ ప్లాంట్ పెట్టాలని తాను వారిని కోరానని సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్నారు. అలా పోస్కో ప్రతినిథులు సీఎం జగన్‌తో భేటీ అయ్యే సమయానికి పోస్కో సంస్థ విశాఖ స్టీలు ప్లాంటు విషయమై ఒప్పందాలు కూడా కుదిర్చేసుకుంది.
అంటే, ఇక్కడ మేటర్ క్లియర్.. అంతా అందరికీ తెలిసే జరుగుతోందిగానీ.. ఎవరూ ఆ విషయాన్ని ఒప్పుకోవడంలేదు. జనం ఇవేవీ గమనించరులే.. అన్నది టీడీపీ, వైసీపీ ఆలోచనగా కన్పిస్తోంది. ఒకరికి పోటీగా ఇంకొకరు విశాఖ ఉక్కు విషయమై హడావిడి చేసేస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లాలో వైసీపీ, టీడీపీ బాహాబాహీకి దిగాయి. ఇదే మరి రాజకీయ విచిత్రమంటే.
‘విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వద్దే వద్దు..’ అంటూ వైసీపీ తమ ఎంపీలతో రాజీనామా చేయించొచ్చు కదా.. గతంలో ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయించినట్లు.? ఛాన్సే లేదు. ఇక్కడే వైసీపీ చిత్తశుద్ధి ఏంటో అర్థమయిపోయింది. పోనీ, టీడీపీ అయినా ఆ పని చేయొచ్చు కదా.? అంటే అంత సీన్ టీడీపీకి కూడా లేదు.
రెండు పార్టీలూ కలిసి విశాఖ ప్రజల్ని గందరగోళంలోకి నెట్టేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయి. రైల్వే జోన్ కోసమో, పోలవరం నిధుల కోసమో, ప్రత్యేక హోదా కోసమో చేయని ‘బంద్’ విశాఖ ఉక్కు కోసం ‘జీవీఎంసీ’ ఎన్నికల సమయంలో చేయడమేంటి.? ఇక్కడే టీడీపీ, వైసీపీ ‘తేడా’ రాజకీయాలు బయటపడిపోయాయ్.