రెడ్డి అనేది ఓ టైటిల్: డీకే అరుణ

రెడ్డి అంటే కులం కాదని.. అది ఒక టైటిల్ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యాఖ్యానించారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి తొలుత ముందుకు వచ్చేది రెడ్డి మాత్రమేనని స్పష్టంచేశారు. ఆదివారం మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో నిర్వహించిన రెడ్డి రణభేరిలో ఆమె మాట్లాడారు. రెడ్డి అనేది కులం కాదని.. అదో టైటిల్ అని పేర్కొన్నారు. గ్రామాల్లో రెడ్ల పరిస్థితి పేరుకే గొప్పగా ఉంటుందని.. అగ్రవర్ణాల్లోనూ చాలామంది నిరుపేదలు ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేసినా.. రాష్ట్రం అమలు చేయకపోవడంతో అగ్రవర్ణాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు.

త్వరలో చేపట్టబోయే ఉద్యోగాల భర్తీలోపు రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే రూ.5వేల కోట్లతో రాష్ట్రంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం ఉద్యోగులు, నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.