మోడీ కామెడీ.. ఐదేళ్ళ ఇస్తే, 70 ఏళ్ళు వృద్ధి చేస్తారట.!

నరేంద్ర మోడీ ప్రధాని అయి దాదాపు ఏడేళ్ళు కావొస్తోంది. దేశం ఈ ఏడేళ్ళలో సాధించిన అభివృద్ధి ఏంటి.? అనేది ఒక్కసారి ఆలోచిస్తే, అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. అప్పుల కుప్పగా దేశం మారిపోయిందన్న అభిప్రాయం రాజకీయ రంగానికి చెందిన వారి నుంచే కాదు, ఆర్థిక వేత్తల నుంచి కూడా వస్తుంది. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. అస్సలేమీ దేశంలో అభివృద్ధి గడచిన ఏడేళ్ళలో జరగలేదంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. కానీ, అభివృద్ధి తక్కువ.. అప్పులు ఎక్కువ.. అనే పరిస్థితి వస్తేనే అది అత్యంత ప్రమాదకరం. దేశం చేస్తోన్న అప్పులు పెరిగిపోతున్నాయి.. రాష్ట్రాలకూ కేంద్ర సాయం తగ్గిపోయి.. రాష్ట్రాలు అప్పులు చేయాల్సి వస్తోంది.

దేశంలో గడచిన ఏడేళ్ళలో రాష్ట్రాలు చేస్తున్న అప్పులు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. పోనీ, ఈ అప్పులు ప్రజల్ని ఉద్ధరించేయడానికేనా.? అంటే, ఇటీవలి కాలంలో దాదాపు 10 కోట్ల మంది మధ్య తరగతి నుంచి పేదరికంలోకి జారిపోయారని నివేదికలు చెబుతున్నాయి. అసలేం జరుగుతోంది దేశంలో.? పెద్ద నోట్ల రద్దుతో మొదలైంది, ఆర్థిక పతనం. అక్కడి నుంచి అన్నీ అమ్ముకోవడం తప్ప.. సంపద వృద్ధి అనే మాటే వినిపించడంలేదు. ‘అన్నీ అమ్మేస్తాం..’ అని పాలకులు నిర్లజ్జగా చెబుతోంటే, ప్రశ్నించలేని అమాయకత్వం ప్రజలది. అధికారంలో వున్నోళ్ళు తమ ప్రాపకం కోసం చేసే అప్పులు.. ప్రజల నెత్తిన గుది బండగా మారతాయి.. మారుతున్నాయి కూడా. పెట్రోలుపై పన్నుల భారం ఎక్కువగా వుందన్న అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ‘కేంద్రమే కాదు, రాష్ట్రాలూ పన్నులు పెంచాయి..’ అని సమాధానమిచ్చారు.

అసలు ప్రశ్న ఏంటి.? సమాధానమేంటి.? ప్రజలకు ఎలా మేలు చేయగలం.? అన్న దిశగా కనీసపాటి విజ్ఞత పాలకుల్లో లేదనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? తాజాగా, పశ్చమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ ‘ఐదేళ్ళు ఇవ్వండి.. 70 ఏళ్ళ వృద్ధి చేస్తాం..’ అని సెలవిచ్చారు. కేంద్రంలో ఏడేళ్ళు అధికారంలో వుండి దేశాన్ని ఏం ఉద్ధరించారు.? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేరుగానీ, కమలనాథులకి రాష్ట్రాల్లో అధికారం కావాలట. ఇదెక్కడి చోద్యం.

Share